ఆఖరి గోడపాణిని జన్నాభట్ల‘‘ఇంకోసారి ఆలోచించు’’ అన్నాడు మహీ సీరియస్‌గా.వీడికేమైంది ఈ మధ్య, ప్రతిదానికీ అడ్డు పడుతున్నాడు. అనవసరంగా ఎక్కువ లీనియెన్స్‌ ఇచ్చానా?‘‘ఆలోచించడానికేం లేదు. కట్టేసెయ్‌, మామూలుగా నువ్వెప్పుడూ కట్టేదే. కొంచెం హైట్‌ పెట్టు కాకపోతే ఈసారి. ఎనిమిది అడుగులు చెయ్‌’’ అన్నాను మహీకి మళ్ళీ ఛాన్స్‌ ఇవ్వకుండా.దెబ్బతిన్నట్టు చూశాడు నా వైపు. నేను చేతులు కట్టుకుని నించున్నాను. ‘‘అదే నా ఆఖరి మాట’’ అనే సంకేతాన్ని పంపుతూ.దృఢత్వానికీ, మూర్ఖత్వానికీ మధ్య ఉండే సన్నటి గీత పైన మునివేళ్ళ మీద నించున్నాన్నేను.వాడో ఆఖరి ప్రయత్నం చేశాడు ‘‘పోనీ తలుపైనా పెడతాను, తర్వాత నీకు మారాలనిపిస్తే ఉంటుంది?’’తల అడ్డంగా ఊపాను.

గీత మీదనుండి వెనక్కి పడిపోతున్నాను. అంతా వీడివల్లే.వాడు వెనక్కి తిరిగి అయిష్టంగా పని మొదలుపెట్టాడు. చకచకా చేసేస్తాడు ఒక్కసారి స్టార్ట్‌ చేశాడంటే. మధ్యలో హఠాత్తుగా ఆపి ‘‘ఈ ఎత్తులో కిటికీ ఒకటి పెడితే బాగుంటుంది కనీసం, నువ్వు అవతలి వైపు చూడొచ్చు ఎప్పుడైనా’’ అని గొణిగాడు. నేను తల దించి గోళ్ళు గిల్లుకుంటున్నాను. గీత మీద నుండి పూర్తిగా వెనక్కి పడిపోయానిప్పుడు.వాడు నిట్టూర్చి, మిగతా పని పూర్తి చేశాడు.‘‘అయిపోయింది, చూస్కో’’ అన్నాడు నా పక్కకొచ్చి నిలబడుతూ. తలెత్తాను. నా పెదాల మీద అప్రయత్నంగా మెరిసిన చిరునవ్వు.మా ఎదురుగా వంద అడుగుల వెడల్పూ, ఎనిమిదడుగుల ఎత్తుతో ఎర్రగా మెరుస్తున్న నున్నటి గోడ!

***************

నా గురించీ, మా ప్రపంచం గురించీ కొంత చెప్పాలి మీకు.మాకు చిన్నప్పటి నుండీ ఇంటా బయటా నేర్పేదీ, మేము అతి శ్రద్ధపెట్టి నేర్చుకునే మొట్టమొదటి విద్య - గోడలు కట్టడం!మీకిది కొంచెం విచిత్రంగా అనిపించొచ్చు, కానీ మాకిది చాలా మామూలు విషయం. ఎవరు ఎంత వేగంగా, అందంగా గోడలు కట్టగలిగితే వాళ్ళే గొప్ప. అసలు గోడలు కట్టడం మా రాజ్యాంగం మాకిచ్చిన ప్రాథమిక హక్కు. ఓట్ల కోసం దాన్ని అమలు పరచడానికి ఏ ప్రభుత్వమూ వెనకాడలేదు. గోడలు కట్టలేని అమాయకులకు ఎలా కట్టాలో మా ప్రభుత్వాలే స్వయంగా నేర్పిస్తాయి కూడా!