ఒక దినమున జగన్నాథుడు, లక్ష్మీ సమేతుడై కేరమ్స్ ఆటలో నిమగ్నులయి ఉండగా -‘నారాయణ, నారాయణ..’‘స్వాగతము మునీంద్రా.. ఆసీనులు కండు.’‘తమరి వినోదమునకు నేను ఆటంకము కలుగజేయలేదుగదా.’‘ఎట్టి ఆటంకమూ లేదు మహర్షీ. ఊరక రారు మహానుభావులు. తమ రాకకు కారణంబు’ ప్రశ్నించె జగత్ప్రభువు.‘తమరు సర్వాంతర్యాములు. తమకు తెలియనిది ఉండదు లోకనాథా. అయినను, తమరు అడుగుటచే నేను తప్పక జెప్పెద. భూమండలంబందున్న ప్రజలందరును ప్రస్తుతము ప్రతి నిమిషము పిడికిట ప్రాణములు పెట్టుకొని భయాందోళనలతో జీవించుచున్నారు వాసుదేవా..’‘ఏమయినది మునీంద్రా, మరల మరో ప్రపంచ యుద్ధము సంభవించెనా.’ లక్ష్మీదేవి ఆత్రుతతో ప్రశ్నించె.‘దేవీ, జరుగుచున్నది యుద్ధమే, గాని ఇందు ఒక ప్రత్యేకత గలదు. ఈ యుద్ధమున భూలోకంబందున్న ప్రతి యొక్కరు ఒకదిశ, కంటికి కానరాని కరోనా అను సూష్మాతి సూష్మమైన వైరి మరియొక దిశ, నిర్విరామముగా అహర్నిశములు తలబడుచున్నారు.’
’అది యేమి, ఆశ్చర్యముగానున్నదే. లక్షలాది ప్రజల ప్రాణములను క్షణములో బలిగొనే మారణాయుధములను చెంతనుంచుకొని కంటికగుబడని, సూష్మమయిన వైరిని అరికట్టలేక పోతున్నారా మానవులు’ అని అడిగె శ్రీదేవి.‘దేవీ, ఆ మారణాయుధములు అమాయక ప్రజానీకమును అంతమొందించగలవు గాని, కంటికి కానరాని వైరిని అరికట్టుటకు లేశమాత్రమూ ఉపయోగపడవు’ నారదుని వివరణ.‘స్వామీ, ఈ సంక్షోభమునుండి మానవాళి బయటబడగలదా’ తన ఆందోళన వ్యక్త బరస్తూ, శ్రీవారినడిగె కారుణ్యలక్ష్మి.నారాయణుడు చిరునవ్వుతోనిచ్చిన సంకేతమును గ్రహించె శ్రీదేవి.‘దేవీ, ఆ సంక్షోభము కేవలము మానవాళికే పరిమితము కాలేదు. అనూహ్యముగా మన యమలోకము గూడ దానికి ప్రభావితమయినది’ అని మహర్షి తన రాకకు గల ముఖ్య కారణంబు వివరించసాగగా -‘అది ఎటుల సంభవించె మహర్షీ’ శ్రీదేవి సందేహము.
‘దేవీ, తమ కర్తవ్య నిర్వహణకై భూలోకంబునకు బోయిన వందలాది యమభటులకు కరోనా వ్యాధితో మరణించిన వారిని తాకుటచే, వారికా వ్యాధి సోకినదట. వేలకొలదీ మరికొందరు భటులు, ఆ వ్యాధి సోకినవారి చెంత నుండుటచే వారినందరిని ప్రత్యేక శిబిరములందు నిర్బంధించి, పరీక్షించవలెనని మన వైద్యులు తమ సలహా తెలియజేసిరట. ఆ శిబిరములు తక్షణము ఏర్పాటు జేయనిచో, వ్యాధి త్వరితగతిన నలుదిక్కులా వ్యాపించి దాని నియంత్రణ అసంభవమగునని వైద్యులు ఆందోళన చెందుచున్నారట.’