‘‘సాగర్‌ నిన్ను పెద్దసారు పిలుస్తున్నారు, చాలా సంతోషంగా ఉన్నారు సారు ఎందుకో?’’పదిమంది ఉండేగదిలో నేను దిగులుగా కూర్చుని ఉండగా, మా అనాధాశ్రమంలో నా తోటి కుర్రాడు వచ్చి చెప్పాడు.అప్పటివరకూ, ‘నేను ఎవరిని? ఎవరికి పుట్టాను? ఎందుకు ఇలా అనాధాశ్రమానికి వచ్చాను?’ అనుకుంటూ గతంగురించి ఆలోచిస్తున్నాను. ఆనందించదగ్గదైతే గతం తలుచుకుని మురిసిపోవాలి. వర్తమానంలో సంతోషంగా గడపాలి. భవిష్యత్తుకోసం కలలుకనాలి.

ఆ కలలను లక్ష్యాలుగా చేసుకోవాలి అప్పుడే అవి నిజం అవుతాయి. కాని లక్ష్యాల కోసం కలలుకంటూ కూర్చుంటే నిజం కావన్న విషయాన్ని నేను రోజూ గుర్తు చేసుకుంటాను. అయితే గతం బాధాకరంగా ఉన్నప్పుడు అది మనిషిని కుదురుగా ఉండనీయదు.పెద్ద సారు అంటే, మా అనాధాశ్రమానికి పెద్ద. ఆయనకు సుమారు ఎనభై ఏళ్ళుంటాయి. ముప్ఫై ఏళ్ళుగా ఈ అనాథ పిల్లల ఆశ్రమాన్ని మునిసిపల్‌ నగరంలో ఉన్న ఉదారులైన ధనికులసహకారంతో విజయవంతంగా నడుపుతున్నారు. సుమారు నూటయాభైమంది ఆడపిల్లలు, మగపిల్లలు ఇక్కడ జీవితం గడుపుతున్నారు.

దిక్కులేని బాబో, పాపో, పసిగుడ్డుగానీ కనుపిస్తే వెంటనే ఆశ్రమానికి తీసుకువచ్చేస్తారాయన. ఈ మధ్యనే ఆయన జన్మదినం ఘనంగా జరిపాం.‘ఎందుకు పిలిచారో?’ అనుకుంటూ ఆశ్రమంలోని పిల్లలందరమూ కలిసి సారు గదిలోకి ప్రవేశించాను. ఆయన తన సీటులోంచి లేచి నిలబడి, చకచకా నడుచుకుంటూ నాకు ఎదురువచ్చారు. నన్ను ఊపిరాడకుండా కౌగలించుకున్నారు. పెద్దవారి ఆప్యాయతానురాగాలు ఎరుగని నాకు ఆ ఆత్మీయస్పర్శ ఉక్కిరిబిక్కిరి చేసింది.‘‘సాగర్‌ యూ ఆర్‌ గ్రేట్‌! మొన్న నువ్వు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా. నీకు ఎంతో మెరిట్‌ ఉంది. కాబట్టే ఇంటర్వ్యూకు హాజరైన వందమందిలోంచి వాళ్ళు ఎంపికచేసిన పది మందిలో నిన్నుకూడా ఉద్యోగంలోకి తీసుకున్నారు. మన అనాధశ్రమం నుండి వెళ్ళిన ఏకైక స్టూడెంట్‌వి నువ్వే. వాళ్ళు ఇప్పుడే నాకు ఫోన్‌ చేసి చెప్పారు’’.