‘‘అమ్మా! సాయంత్రం అక్క స్కైప్‌లో కాల్‌ చేస్తానని చెప్పింది. అందరితో ఒకేసారి మాట్లాడాలట’’ డైనింగ్ టేబుల్‌ మీద పిల్లలకు టిఫిన్లు కడుతున్న జమునతో చెప్పాడు సూర్య.‘‘అందరితో ఒకేసారి ఏం మాట్లాడాలట?’’ అడిగింది జమున.‘‘ఏమో మరి! అడిగితే చెప్పలేదు. ఆఫీసునుంచి రాగానే నన్ను వీడియో కాల్‌ చేయమంది’’ అన్నాడు సూర్య.

‘‘నాన్నగారూ మీరు కూడా మీ పనులేమన్నా ఉంటే పూర్తిచేసుకుని ఇంట్లోనే ఉండండి. నేను త్వరగానే వచ్చేస్తా’’ అంటూ పిల్లలను స్కూలులో దింపడానికి తీసుకుని వెళ్లిపోయాడు.అరగంట తర్వాత కోడలు సుమన కూడా తన బ్యాగ్‌, టిఫిన్‌బాక్స్‌ తీసుకుని ఆఫీసుకు వెళ్లిపోయింది.తెల్లారినప్పటినుంచీ హడావిడి, కోలాహలంగా ఉండే ఇల్లంతా ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. రెండు కప్పులలో వేడి కాఫీ తీసుకుని భర్తకు ఒకటిచ్చి తనొకటి తీసుకుని అలసటగా అతని ఎదురుగా కుర్చీలో కూలబడింది.‘‘జమునా! ఇవాళ మధ్యాహ్నం భోజనంలోకి బజ్జీలేసి మజ్జిగపులుసు చేస్తావా? చాలా రోజులైంది కదా, తినాలనిపిస్తుంది. అలాగే సాయంత్రానికి కాసిన్ని మినపప్పు వడలు చేయి. పిల్లలు కూడా తింటారు’’. అలసటగా ఉన్నా ‘‘సరేనండి. చేస్తాను’’ అంది జమున.

‘‘అవునూ, ఇందిర ఎందుకు అందరూ ఉన్నప్పుడే మాట్లాడతానంది. ఏదైనా గొడవ జరిగిందా? నీకేమైనా చెప్పిందా జమునా?’’ కాస్త ఆదుర్దాగా అడిగాడు రాజారాం.‘‘ఏమోనండీ, నాతో ఏం చెప్పలేదు. నాకూ అయోమయంగానే ఉంది. భయంగా కూడా ఉంది. వెంటనే ఫోన్‌ చేయలేం. అమెరికాలో ఇప్పుడు వాళ్లకు అర్థరాత్రి కదా!! సాయంత్రం వరకు ఆగుదాం.’’ ఖాళీ కప్పులు తీసుకుని వంటింట్లోకి వెళ్లింది జమున.ఇందిర ఏం మాట్లాడాలనుకుంటుందో..అనే ఆలోచనతో పనులన్నీ ముగించుకుని భర్త అడిగాడని మజ్జిగపులుసు చేసింది, ఇద్దరూ భోజనం పూర్తిచేశారు. సాయంత్రం వడలు చేద్దామని మినపప్పు నానబెట్టి కాస్సేపు నడుం వాల్చింది. రాజారాం కూడా నిద్రపోయాడు.