బెలగాం సెంటర్ నుంచి పార్వతీపురం టౌనుకెళ్ళే తోవలో బోలెడంత కాలక్షేపం! చర్చి వీధి సెంటరు, పోలీసు క్వార్టర్సు, బిసం కటక్ బంగ్లా దాటి కొంచెం ముందుకి దిగితే సందడే సందడి.కుడివైపు మున్సిఫ్ కోర్టు ఆవరణ. మధ్యలో మర్రిచెట్టు, దాని చుట్టూ తిన్నె, తిన్నె మీద కూర్చొని జంధ్యాల కోసం తకిలీతో దారం తీసే గెడ్డం పంతులు, చొక్కా జేబులనిండా ఇంకు పెన్నులు, సీజన్ బట్టి చేతుల్లో డైరీలు, పంచాంగాలు అమ్ముకునే పొట్టి షావుకారు, వకీళ్ళు, గుమాస్తాలు, కోర్టు పక్షులు, ఒకరా? ఇద్దరా? వానాకాలంలో కప్పలతో నిండిన చెరువు కనిపించేదక్కడ!

కోర్టువారు మధ్యాహ్నం లంచ్ బ్రేక్ కి దిగగానే ఎదురుగా పాల్ఘాట్ మణి కేఫ్, ఉడిపి కృష్ణా విలాస్, రాజుల మిలటరీ భోజనం హోటల్ కిక్కిరిసిపోయేవి. కోర్టు గోడకీ, రోడ్డుకీ మధ్య పల్లంలో చింతచెట్లకింద గజ్జెలు,డోలక్ సందడి చేసేవి. ‘నాగిన్’ లోని ‘మన్ డోలే మెర తన్ డోలే..’ పాట బుల్ బుల్ మీద మొదలయ్యేది. గారడీ సాయిబు సులేమాన్ వినోదం జనాన్ని రమ్మంటూ పిలిచేది. కోర్టు పక్షులతో పాటు, లంచ్ టైములో ఇళ్ళకువెళ్ళే బెలగాం బ్రాంచ్ స్కూలు పిల్లలు, ఆర్.సి.ఎం స్కూల్ పిల్లలు అక్కడ ఆగేవారు. గారడీ సాయిబు విద్యలు చూడటానికి గుమిగూడేవాళ్ళు. ఆ రోజుల్లో ఊరూరా తిరుగుతూ ఏటా దసరా మొదలుకుని సంక్రాతి వరకు బెలగాంలో మకాం వేసి ప్రదర్శనలిచ్చేవాడు సులేమాన్.