ఆమె ముక్కుసూటి మనిషి. ముఖంమీదే కొట్టినట్టు మాట్లాడుతుంది. ఆప్తులు పలకరించినప్పుడు కూడా చిన్నతేడా వచ్చినా అలవోకగా చులకనచేసేస్తుంది. వాళ్ళు హర్టయ్యారని తర్వాత గ్రహించుకుని అయ్యయ్యో, అలా అనకుండా ఉండాల్సిందే అని రియలైజవుతుంది. ఇలా ఎన్నిసార్లో! కానీ ఒకసారి మాత్రం ఆమె ఆ ఏడుకొండలవాడిని ఆశ్రయించాల్సి వచ్చింది!
జీవితంలో తెలిసోతెలియకో, సరదాకో, ఉబుసుపోకో ఏదోఒక కారణంతో ఎదుటివారిని తక్కువ చేయాలని అనుకుంటాం. మనలోలేని తెలివితేటల్ని ఎదుటివారికి చూపించాలను కుంటాం. కానీ మనవాళ్ళవల్ల మన ఇంట్లోనే మనం చులకనైపోతే....???బాల్కనీలో కుర్చీవేసుకుని బయటపడుతున్న అరుదైన వర్షాన్ని చూస్తోంది హర్షిత. ఈ ఏడాది ఇక చినుకులే తమమీద పడవేమో అని నిర్ణయించుకున్న చెట్లు ఒక్కసారిగా కుంభవృష్టి పడుతుంటే మౌనఋషుల్లా ఆనందం అనుభవిస్తున్నాయి. బడివదిలే సమయం కావడంతో చిన్నచిన్న పిల్లలు, వారిని అనుసరిస్తున్న తల్లులు అందరూ దొరికినచోట తలదాచుకుని తమ బిడ్డలపై చినుకుపడకూడదని తాపత్రయపడుతున్నారు.
బండిలో ప్రయాణించేవారు మరింత స్పీడుపెంచి పరుగులుతీస్తున్నారు. కార్లు మరింత నిదానంగా పెళ్ళికూతుర్లలా నడుస్తున్నాయి. నేలతల్లిమాత్రం పులకరింతతో తలారా స్నానం చేస్తోంది. ఇవన్నీ చూస్తున్న తనలో చిత్రమైన అనుభూతి! కళ్ళలో కనిపిస్తోంది. ఏవేవో జ్ఞాపకాలు! తన జీవితానికి అనుభూతులంటూ ఏమీ లేవు కానీ వల్లమాలిన అనుభవాలున్నట్లు కనిపిస్తున్నాయి. ‘‘హర్షితా! ఏం చేస్తున్నావు? లోపలికి రావచ్చా?’’ అడిగింది ఉమ నవ్వుతూ.ఆ మాటలకు కిసుక్కున నవ్వి ‘‘లోపలికి వచ్చేసి రావచ్చా అని అడగటం ఎందుకు?’’‘‘సరేలేవే! మనమధ్య స్నేహం ఉంది కదాని మరీ చనువు ప్రదర్శిస్తే బావుండదని..’’ అంటూ ఎదురుగా ఉన్న కుర్చీలో నీటిని టవల్‌తో తుడిచి కూర్చుంటూ సరదాగా అంది ఉమ.
‘‘చెప్పు! ఏం చేస్తున్నావు? అలా ఆకాశంవైపు చూస్తూ కూర్చునే బదులు, ఈ వర్షంలో తినడానికి ఏదైనా వేడిగా చేయకూడదూ’’ అంది ఉమ.‘‘అసలు ఎప్పుడుపడిందని వర్షం? వర్షాకాలాన్ని గుర్తుచేయడానికన్నట్లు రాకరాక ఏదో ఒకటి అరా మొహమాటంగా పడుతోందంతే! ఉన్న వేడికాస్తా బయటకొచ్చి ఒళ్ళు చిరాకుగా ఉంది. వేడిగా చేసేంత లేదు ఈ వర్షానికి....’’ అంది హర్షిత విసుక్కుంటూ.‘‘చెయ్యడానికి బద్దకం అని ఒప్పుకో!’’ మధ్యలో వర్షాన్ని విసుక్కోవడం ఎందుకు?’’