ఒకప్పుడు చందన దేశాన్ని ప్రసేనుడనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు.ఆయనకు వృద్ధాప్యం రాగానే కొడుకు సుసేనుణ్ణి పిలిచి, ‘‘నాయనా! నేనిక ఎంతోకాలం ఈ రాజ్యభారం మోయలేను. నీవొక ఏడాదిపాటు దేశాటన కావించి రాజ్యపాలనకి అవసరపడే అనుభవం సంపాదించుకురా’’ అని చెప్పాడు. సుసేనుడు వెంటనే దేశాటనకు బయల్దేరాడు. ఎన్నోదేశాలు తిరిగి చివరకు రత్నగిరికి చేరుకున్నాడు.
ఆ దేశాన్నేలే రాజు సుధాకరుడు యువకుడు. సింహాసనం ఎక్కి ఐదేళ్లు మాత్రమే గడిచింది. ఐనా ఎంతో సమర్థవంతంగా పరిపాలన చేస్తున్నాడు. ప్రజలకు చోరభయం లేదు. దేశానికి శత్రుభయం లేదు. రాజ్యం సుభిక్షంగా ఉంది. ప్రజలు సుఖసంతోషాలతో ఉన్నారు.అతడి పరిపాలన చూసి సుసేనుడెంతో ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే సుధాకరుడి తండ్రి రత్నాకరుడికి సాటిరాజుల్లో మంచిపేరులేదు. ఆయన నిరంతరం విలాసాల్లో మునిగితేలుతూ ఉండేవాడు. ప్రజలగురించి ఏ మాత్రమూ పట్టించుకునేవాడు కాదు. అందువల్ల దేశంలో కొంత అరాచకం వచ్చింది. కొందరు విప్లవకారులు కూడా బయల్దేరారు. ఆ విప్లవకారులు ఆదిలో కొందరు ఇరుగు పొరుగు రాజుల సాయం కోరారు.
ఐతే అప్పట్లో అన్ని రాజ్యాలమధ్యా సంధి ఒప్పందం ఉండేది. యుద్ధంవల్ల ధన నష్టంతప్ప మరేమీ ప్రయోజనంలేదని గ్రహించిన రాజులందరూ ఒక్కటై ఆ సంధి ఒప్పందం చేసుకున్నారు. అది రత్నాకరుడికి ఉపయోగించింది.సంధి ఒప్పందం కారణంగా ఇరుగు పొరుగు రాజులకి కొన్ని ఇబ్బందులు లేకపోలేదు. రత్నగిరి ప్రజలు రాజ్యంలోని విపత్కర పరిస్థితులకు తట్టుకోలేక మూకుమ్మడిగా పొరుగురాజ్యాలకు వలస పోసాగారు. ఆ శరణార్థుల పోషణభారం ఒక సమస్య అయితే, శరణార్థుల్లో కొందరు సృష్టించే అలజడి మరో సమస్య.