ఎక్కడైనా వీధి అరుగుమీద పడకకుర్చీ కనిపిస్తే ఆయన జ్ఞాపకాలు తెరుచుకుంటాయి. కట్టుడుపళ్ళ కటకటలూ, ఊతకర్ర టకటకలూ ఆయన్ని గుర్తుకుతెస్తాయి. తెరుచుకున్న నస్యం డబ్బా, అరుగునిండా పరుచుకున్న చుట్టపొగా, అప్పుడే వచ్చిన న్యూస్ పేపరూ కలగలిసిన వింత పరిమళాలు ఆయన కబుర్లు మోసుకొస్తాయి. అయిదారేళ్ళ పిల్లలతో డెబ్భైయ్యేళ్ళ అనుభవం దోబూచులూ, దొంగాటలూ ఆడినప్పుడు బెలగాంలోని అగ్రహారంవీధి కళ్ళకు కడుతుంది. వీధి మొదట్లో ఓ ఇంటి అరుగుమీద వాలుకుర్చీ కిర్రుమంటుంది. అందులోని సూరి తాత అందరిలోనూ మంచితనాన్ని చూసిన వైనం మనసు తలుపు తడుతుంది.
చేతికర్ర పైకెత్తి సూరి తాత మొట్టికాయవేస్తే అదో సరదా! ఆయనచుట్టూచేరి వీధిలోని పిల్లలంతా గోలచెయ్యడం అదో ఆనందం. పిల్లల ఆటలకి ఆయన అంపైర్. ఆటకిముందు పంటలు వేసేటప్పుడు సూరి తాత పర్యవేక్షించేవాడు. దాగుడుమూతల ఆటల్లో దొంగతాలూకూకళ్ళు తనేమూసి, అంకెలు లెక్కపెట్టేవాడు. ఆటలు పూర్తైన తర్వాత ఎక్కాలూ, పద్యాలూ, శ్లోకాలూ అప్పచెప్పమనేవాడు. నీతికథలు చెప్పేవాడు. పిల్లల జట్టీల్లో తాత తీర్పులకు తిరుగేలేదు. తగవులు తీర్చడంలో సూరి తాత స్టైలే వేరు. ఎవర్నీ తప్పు పట్టేవాడు కాదు. అందరి వాదనలూ వినేవాడు. అందరు చెప్పినవీ కరెక్టేననేవాడు.
‘‘ఒరేయ్ కొట్టినవాడు మంచివాడే, దెబ్బతిన్నవాడూ మంచివాడే. ఇవన్నీ ఆటలో అరటిపళ్ళు, పులుసులో బూరిముక్కలూనూ. పడ్డవాడెప్పుడూ చెడ్డవాడుకాదు. పొండి...ఆడుకోండి’’ అనేవాడు. ఎవరైనా ‘‘తాతా నేను మంచివాడినే కదూ’’ అనడిగితే, ‘‘ఒరేయ్ నువ్వు మంచి వాడివిరా’’ అనేవాడు. మరో కుర్రాడు వచ్చి, ‘‘మరి నేనో?’’ అనడిగితే ‘‘నువ్వూ మంచివాడివే రా’’ అనేవాడు. పదిమంది పిల్లలు ఆయనచుట్టూ చేరి, బృందగానంలాగా ‘‘నేనో?నేనో?నేనో’’ అని ఒకేసారి మీదపడితే, ఒక్కొక్కరినీ చూపిస్తూ ఇంటిపేరుతో సంబోధిస్తూ ‘‘నువ్వుమంచివాడివి, నువ్వుమంచివాడివి, నువ్వు..నువు...నువ్వూ..మీరందరూ మంచివాళ్ళేనర్రా..పొండి’’ అంటూ భళ్ళున నవ్వేవాడు సూరి తాత.