అతను ప్రకృతిని ఆరాధిస్తాడు. వర్షాన్ని ప్రేమిస్తాడు. వర్షంలో తడిసిముద్దైపోవాలనుకుంటాడు. అనంత సముద్రాన్ని ఆస్వాదిస్తాడు. ఆకాశాన్నీ అందుకోవాలని చూస్తాడు. అంతేకాదు, అతడిలో కొన్ని భయాలూ ఉన్నాయి. ఐ.సి.యు అంటే భయం, చనిపోయిన తర్వాత శవం వాసనరాకుండా ఉపయోగించే ఫ్రీజర్ బాక్స్ అంటే భయం. ఈ రెంటికీ దూరంగా ఉండాలని బతికుండంగానే తాపత్రయ పడ్డాడతను. కానీ జరిగిందేమిటంటే....
‘‘ఆకాశం ఇంతకుముందులా ప్రశాంతంగా లేదు. అక్కడక్కడా నల్లనిమబ్బులు. వర్షం వస్తుందేమో...!ఒక్కసారి ఆ అలలవైపుచూడు, ఎలా నురుగులు కక్కుకుంటూ ఒడ్డుకివచ్చి మరలా వెనక్కి పోతున్నాయో...’’ తన్మయత్నంగా ఆ అలలనే చూస్తూ అన్నారు ఆయన.‘‘చూశానుగానీ, ఇక లేవండి, ఇంటికి వెళ్దాం’’ అన్నాను.‘‘కాసేపు ఉండవోయ్, ఆ సముద్రాన్ని చూసి ఆనందించవోయ్’’ అన్నారు.‘‘ఎంతసేపు చూస్తారు. ఆ సముద్రాన్ని, ఆ అలల్నీ? ఎప్పుడూ ఉండేవే, తరచూ చూసేవే. పదండి...పదండి’’ అని తొందరపెట్టాను.
‘‘నీలో ప్రకృతిని ఆస్వాదించే మనసు కొరవడిందోయ్. ఈరోజు ఎందుకో సముద్రం గంభీరంగా ఉంది. అలలుకూడా చిన్నగా వస్తున్నాయి’’ అన్నారు.‘‘మహానుభావా, మీరు అలల్ని లెక్కబెట్టుకుంటూ కూర్చుంటే? అవతల వర్షం వచ్చేట్టుగా ఉంది, తర్వాత మీ ఇష్టం’’ అన్నాను చిరుకోపంతో.ఆయన తలపైకెత్తి ఆకాశంవైపు చూశారు. ఆకాశంలో అక్కడక్కడా నల్లని మబ్బులు. వాతావారణంలో కొంతమార్పు కనిపిస్తుంది. ఏ సమయంలోనైనా వర్షం వచ్చేట్టుగా ఉంది.‘‘నిర్మలా! వర్షం వచ్చేట్టుగానే! ఉంది. రానీ. కాసేపు ఈ సముద్రపు ఒడ్డున, సన్ననివానలో చిన్నగా తడుస్తూ నడుచుకుంటూ వెళదాం, ఎంత బాగుంటుందో తెలుసా...!? ఆ అనుభూతి...ఏం...?!’’ అని నావైపు చూశారు.‘‘ఏం? మీరేమైనా వయసులో ఉన్నారా? అరవై ఎప్పుడోదాటింది. ఉద్యోగంలోంచి కూడా తీసేశారు తెలుసా!?’’ అన్నాను.‘‘నన్ను ఉద్యోగంలోంచి తీసేయలేదు. రూల్సుప్రకారం రిటైరయ్యాను. నువ్వు సరిగ్గా మాట్లాడటంనేర్చుకో. అయినా నా శరీరానికి వయసు పెరిగిందేమోగానీ నా మనసుకి, ఆలోచనలకి కాదు...’’ ఆయనకి ఇట్టే కోపం వచ్చేస్తుంది.‘‘గొప్పగా చెప్పారులెండి. ఏదీ నిజం ఒప్పుకోరుగా. మీరు ఎప్పుడు వర్షంలో తడిసినా జలుబు, జ్వరం రావడం ఖాయం. ఇది నాకు బాగా అనుభవమేగానీ, పదండి...పదండి’’ అని ఇసుకలో కూర్చున్న ఆయన్ని లేవదీశాను.