నన్ను కొంతకాలం ఇక్కడ ఉండనీయండి స్వామీ..అని ఆశ్రమ గురువును ప్రార్థించాడతను. ‘వెంట ఏమీ తెచ్చుకోనివారికే ఇక్కడ ఆశ్రయం’ అన్నారు గురువు. నేనేమీ తెచ్చుకోలేదు స్వామీ..అని తన రెండు చేతులూ చాపి చూపించాడతను. లేదు, నువ్వు తెచ్చుకున్నావ్‌..అన్నారు గురువుగారు. లేదు, తెచ్చుకోలేదు..అన్నాడతను. పదే పదే వాళ్ళ మధ్య ఆ మాటలే సాగాయి. చివరకతడు కోపంతో ‘ఏమీ తేలేదన్నానుగా...’ అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఏమైందంటే....

**************************************

టీ కప్పు భళ్ళున పగిలిన చప్పుడు!గుండెలు చిక్కబట్టుకుని వంటింట్లోంచి హాల్లోకి పరుగెత్తుకొచ్చింది ప్రమద. ఒంట్లో అణువణువునా ఆమెలో టెన్షన్‌! దానివల్ల వచ్చిన దడని కంట్రోల్‌ చేసుకుంటూ హాలుమధ్యలోకి వచ్చి నిలబడింది.అక్కడ టేబుల్‌ మీద ఉన్న మరికొన్ని వస్తువులను ఆవేశంగా నేలమీదకి విసిరికొట్టాడు పురుషోత్తం. ఎందుకో అర్థంకాకపోయినా భర్తకి విపరీతమైన కోపం వచ్చిందని అర్థమైంది ప్రమదకి. అది ఆమెకు చాలాసార్లు ఎదురయ్యే అనుభవమే కాబట్టి, నెమ్మదిగా వంగి అక్కడ నేలమీద చిందరవందరగా పడివున్న పగిలిన పింగాణీ టీ కప్పు ముక్కలు చేత్తో ఏరసాగింది.అంతకు రెండునిమిషాల ముందు ఆ ఇంటి హాల్లో ఉన్న ల్యాండ్‌లైన్‌ ఫోన్‌ గణగణా మోగింది. ఫోన్‌ లిఫ్ట్‌ చేశాక అతనికి విపరీతమైన కోపం వచ్చిందని అర్థమైంది ప్రమదకి. అయితే ‘ఆ ఫోన్‌ కాల్‌ ఎవరు చేశారో’ అనుకుంది.‘‘మనిషన్నవాడెవడైనా వాడిగుమ్మంలోకి అడుగుపెడతాడా? సిగ్గు లేదా వాడికి? ఏ ముఖంపెట్టుకుని నాతో మాట్లాడదామనుకుంటున్నాడు అసలు?’’ గట్టిగా అరుస్తూ నేలమీద పడివున్న ఫ్లవర్‌వేజ్‌ని కాలితో విసురుగా తన్నాడు. అది గోడకు తగిలి మళ్ళీ వెనక్కివచ్చి ప్రమద నుదుటికి తగిలింది.

అబ్బా! అంది చేత్తో నుదుటిని అదుముకుంటూ.ఆ విషయం అసలేమీ పట్టించుకోలేదు పురుషోత్తం. అతని కోపానికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో హింస అనుభవిస్తూనే ఉంటుంది ప్రమద. పురుషోత్తంతో ఆమె పెళ్ళి జరిగినప్పటి నుండీ అదే తంతు. అతనికి ఏ విషయంలో ఎప్పుడు కోపం వస్తుందో అర్థంకాక అయోమయానికి గురయ్యేది ఆమె. అది ఇన్నేళ్లనుండీ పెరుగుతూ వచ్చిందేతప్ప తగ్గలేదు. ఏనాడూ ఆమె ప్రశాంతమైన జీవితం అనుభవించలేదు. ఎప్పుడూ భయం భయంగానే గడుస్తోంది ప్రమద కాపురం. ఎప్పుడు ఏ పొరపాటు జరుగుతుందో, దానికి ఎంతగా కోప్పడి అరిచి గొడవ చేస్తాడో అని భయపడుతూ ఉంటుంది ఎప్పుడూ.