‘‘మీనాకు భర్త విడాకులిచ్చాడట. అత్తయ్యవచ్చి ఏడుస్తూ చెప్పింది. పెళ్ళై రెండేళ్ళే. ఏంటో ఇప్పటి పిల్లలు. ఇలా పెళ్ళవుతోందో లేదో వైవాహిక జీవితం అలా పెటాకులైపోతోంది. చిన్నిచిన్న కారణాలకే విడాకులు తీసుకుంటున్నారు. పది లక్షలు కట్నంగా ఇచ్చారు. మీనా చేసిన తప్పుకు భర్తనుంచి ఒక్క రూపాయి కూడా మనోవర్తి రాదని కోర్టు తీర్పు ఇచ్చిందట.’’

నేను ఇంటికి రాగానే అమ్మ చెప్పింది.‘‘అత్తయ్య ఇప్పటివరకు నీకోసం ఎదురుచూసి ఇప్పుడేవెళ్ళింది. ఇవాళ బాగా ఆలస్యమైందేంటి?’’ అమ్మ అడిగింది.‘‘రేపు కోర్టులో విచారణకువచ్చే కేసులకు సంబంధించి మా సీనియర్‌తో కలిసి చర్చించానమ్మా, అందుకే రావడం లేటైంది’’ అన్నాను.ఇందాక అమ్మ చెప్పిన మాటలు మళ్ళీ గుర్తుకొచ్చాయి. ‘మీనా చేసిన తప్పుకు భర్తనుంచి ఒక్క రూపాయి కూడా రాదని కోర్టు తీర్పు చెప్పడమేంటి? అసలు మీనా కాపురంలో కలతలకు కారణమేంటి? రేపొకసారి అత్తయ్య ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలి’ అనుకున్నాను.‘‘కాళ్ళు కడుక్కుని రా, అన్నం పెడతాను’’ అని అమ్మ చెప్పడంతో, ‘‘చిరాగ్గా ఉంది ఏకంగా స్నానం చేసి వస్తాను’’ అని టవల్‌ తీసుకుని బాత్‌రూమ్‌లోకి వెళ్ళాను.

ఆ తర్వాత అమ్మ నాకు భోజనం వడ్డిస్తూ, ‘‘అది నా అన్నకూతురు. నీకిచ్చి పెళ్ళిచేద్దామనుకున్నాం. నువ్వేమో మేనరికాలు చేసుకోకూడదని చెప్పావు, మనమీద కోపంతో మామయ్య, అత్తయ్య దానికి బయటిసంబంధం చూసి పెళ్ళిచేశారు. పది లక్షలుపోసి అల్లుడిని కొన్నారు. వాడుచూస్తే దీని జీవితంలో నిప్పులుపోశాడు. ఇప్పుడిది పుట్టింటికి తిరిగి వచ్చింది. పెళ్ళికావల్సిన ఇంకో పిల్ల ఉంది ఇంట్లో. ఇప్పుడు దాని పెళ్ళి ఎలాచేస్తారో ఏమో...’’ అమ్మ కంట తడి పెట్టింది.