‘హలో... హలో... దిస్ ఈజ్ తేజ... హూ ఈజ్ దిస్...’‘హలో... బుచ్చన్నా’ అటునుండి ఆదుర్దాతో నిండిన అక్క కంఠం.అమ్మావాళ్ళకి తప్ప ఎవరికీ తెలియని తన అసలు పేరు, ఇండియా నుండి. దెబ్బకు నిద్రమత్తు వదిలింది. బెడ్‌పై నుండే కాల్ లిఫ్ట్ చేసినవాడినల్లా దిగ్గున లేచాను.
ఇంత అర్ధరాత్రి ‘అక్కా... ఏమైంది?’ వద్దనుకున్నా ఏదో భయం తొంగి చూసింది నా కంఠంలో.‘నాన్నకు కొంచెం ఆరోగ్యం బాలేకపోతే హాస్పిటల్లో జాయిన్ చేశాను. నిన్నే కలవరిస్తున్నాడు. అమ్మ నాన్నదగ్గర హాస్పిటల్లో వుంది. తొందరగా రా’ అక్క అంది.‘నాన్న... నాన్నకు ఇప్పుడెలా ఉందక్కా? ప్రాబ్లం ఏమీ లేదు కదా. అమ్మతోనైనా మాట్లాడించకూడదూ? నేను వెంటనే బయల్దేరుతాగాని.’‘బానేవుంది. హాస్పిటల్లో సిగ్నల్ లేవుగాని... నువ్వు రారా’ పెట్టేసింది.ఇక నిద్ర పట్టలేదు. ఎంతో అత్యవసరమైతే తప్ప అక్క రమ్మనదు. ఏమైంది నాన్నకి? మనసెందుకో కీడు శంకించింది.పక్కన సునీల, పిల్లలిద్దరూ హాయిగా నిద్ర పోతున్నారు. తను ఒక్కడే వెళ్లాలా...? అందరూ వెళ్ళాలా? ఇంత హడావుడిగా అంటే... అయినా ఫర్లేదు, అందరూ వెళ్ళడమే మంచిది.
అమ్మ ఎన్నోసార్లు అడిగింది అందరూ రమ్మని. దాదాపు ఆరేళ్లవుతోంది పిల్లలతో వెళ్లి. పిల్లతో ఏంటి... చిన్న పాప పుట్టినదగ్గరనుండీ కూడా అమ్మ, నాన్న చూళ్ళేదు. స్కైప్‌లో చూడడమే తప్ప. అందరితో కలిసే వెళితే సరి.అర్జెంట్ ఫ్లైట్ టికెట్స్ బుక్ చేశాను. ఆఫీస్‌కి లీవ్ అరేంజ్మెంట్స్ చేసుకున్నాను.విషయం చెప్పి అర్జెంట్‌గా సునీలని పిల్లలని బయల్దేరదీసాను. ప్రతీచోటా సమయానికే తప్ప డబ్బుకు ప్రాధాన్యత ఇవ్వకుండా, ఫ్లైట్ తర్వాత కూడా టాక్సీ, కాబ్ బుక్ చేసుకుని ఫోన్లో అక్క, బావలతో టచ్‌లో ఉంటూ తమ ఊరిలోకి అడుగు పెట్టాడు.మట్టిరోడ్డు పోయి సిమెంట్ రోడ్డు వచ్చింది.
గుడిసెలాంటి ఇంటిముందర ఉండే ఆవులు, గడ్డివాములు పోయి చిన్నడాబా ఇళ్లయ్యాయి. పెంకుటింటి ముందు, డాబా ఇళ్ళముందు ఇంతకుముందు అందరూ కూర్చుని మాట్లాడుకునే అరుగులు పోయి, గోడలు గేట్లు వెలిసాయి. గడపై పసుపు పూసి బొట్లు పెట్టి, గడప చుట్టూ ఎర్రమట్టితో అలికి, వాకిట్లో పచ్చని పేడతో కల్లాపి చల్లి, తెల్లని ముగ్గు వేసే సంస్కృతి పోయి సిమెంట్ వాకిళ్లపై కలర్లతో ముగ్గువేసే సంస్కృతి వచ్చింది. ఇపుడిపుడే నాగరికత సంతరించుకుంటున్న ఊరు. అప్పటి పాత ఆనవాళ్లు లేకుండా చేసుకోవడానికి వ్యర్థప్రయత్నాలు చేస్తోంది.