మధ్యాహ్నం ఒంటిగంట.వంట చేసేసి అనీ డైనింగ్ టేబుల్‌పైన సర్దేసింది. ఇంకో అరగంటలో మేడం, సర్ భోజనానికి వచ్చేస్తారు అనుకుంది పదిహేడేళ్ళ శోభ.ఇక్కడ అంతా టైం ప్రకారం జరిగిపోవాలి. ఎక్కువ నవ్వకూడదు. ఎక్కువ మాట్లాడకూడదు. అన్నీ పద్ధతిగా ఉండాలి అంటారు మేడం.ఇల్లు చాలా పెద్దది. అంత పెద్ద ఇంట్లో చిన్న శబ్దం కూడా వినిపించకూడదు. నిశ్శబ్దం అంటేనే తెలియని దానికి ఈ ఇల్లు ఒక పెద్ద బందిఖానాలా అనిపిస్తోంది.
బయట తోటలోకి వచ్చి కూర్చోంది. అక్కడే వేపచెట్టుకొమ్మలు వింజామర వీస్తున్నట్లుగా ఊగుతున్నాయి. చెట్టు మీద పిట్టలు అల్లరి చేస్తూ గోలగోలగా కబుర్లు చెప్పుకుంటున్నాయి. నా కన్నా మీరే నయం అనుకుంది.కళ్ళు మూసుకున్న శోభకి ‘‘ఆ తోటలోనొకటి ఆరాధనాలయము, ఆ ఆలయములోని అందగాడెవరే, అందగాడెవరే, అందగాడెవరే...’’ అన్న పాట వినిపిస్తోంది.ఒక్కసారి ఉలికిపడి లేచి చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ లేరు అంతా భ్రమ అనుకుంది.అప్పుడే అక్కడికి వచ్చిన కమలమ్మ, అక్కడ కులాసాగా చెట్టుకింద కూర్చున్న కూతురిని చూస్తూ ‘‘శోభా! మేడం వాళ్ళు వచ్చేశారు టేబుల్‌మీద అన్నీ సర్దు.
ఎక్కువ మాట్లాడకు, అడిగినదానికి సమాధానం ఇవ్వు’’ అంటూ హెచ్చరిస్తూనే హడావుడి పెట్టింది. ఆ మాటలకి కోపం వచ్చింది.అసలే ఉరికే జలపాతంలాంటి శోభకి ఇక్కడ ఇలా మరబొమ్మలా బిగుసుకుని ఉండటం చేతకావటం లేదు. నిశ్శబ్దం అంటే చిరాకు. స్వేచ్ఛగా నోరు విప్పాలని, మనసుతీరా మాట్లాడుతూ ఉండాలని ఉంటుంది. తనది కానిచోట ఉన్నట్లుగా, ఊపిరాడనట్లుగా ఉంటోంది శోభకి. కానీ ఆ ఇంటి పద్ధతులు ఒక నియంతలా పక్కనే నిలబడి కాపలా కాస్తున్నట్లుగా అనిపిస్తుంది.