ఎంత చదువు చదివినా మనిషి మనోధైర్యం కోల్పోకూడదు. కానీ కొన్ని దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నవాళ్ళు మాత్రం అంత త్వరగా కోలుకోలేరు. సమాజంకూడా వాళ్ళమీద ఒక ముద్ర వేసేస్తుంది. ఎక్కడకు వెళ్ళినా వాళ్ళని ఆ రకంగానే చూస్తుంది. అలాంటప్పుడు బతకడంకోసం వాళ్ళు ఎంతకైనా దిగజారాల్సి రావచ్చు. ఈ కథలో కూడా శాంతి అలాంటి పరిస్థితుల్నే ఎదుర్కొంది. మరి అలాంటివాళ్ళను అక్కునజేర్చుకునేదెవరు?
‘‘పోలీసులు వస్తున్నట్టున్నారు...’’విజిల్ శబ్దానికి కంగారుగా లేస్తూ అన్నాడతను.నేను చెయ్యి చాచేలోపే గబగబా బయటకు వెళ్ళిపోయాడు.ఉస్సురంటూ నిట్టూర్చాను. ఒంటి కష్టానికి ప్రతిఫలం దక్కకపోతే వచ్చే మానసిక నిస్సత్తువ ఎంతటి బలహీనమో అది అనుభవించేవారికి మాత్రమే అర్థమవుతుంది. ఒంటి నీరసాన్ని మనసు నిస్సత్తువ అధిగమిస్తుంటే బట్టలు సరిచేసుకుని బయటకు వచ్చాను.చుట్టుపక్కల గుడిసెల్లో కలకలం....! కొంచెం దూరంగా పోలీస్ జీప్ ఆగి కనిపించింది. దగ్గరకొచ్చేస్తున్నారు ముగ్గురు పోలీసులు. ఒకడు నా దగ్గరకు వస్తూ, ‘‘ఊ.. పద. జీపెక్కు..’’ అన్నాడు.నాలుగడుగులు వేసేసరికి, ఎదురుగ జీప్ ముందు ఎస్సై ప్రదీప్....! అతను నాకు బాగా తెలుసు. అందుకే...ఎస్సై కళ్ళబడకుండా ముఖం పక్కకు తిప్పి అందరితో పాటూ జీప్ ఎక్కాను.
స్టేషన్‌కు వచ్చాక జీప్ దిగుతున్న మమ్మల్నందర్నీ పరీక్షగా చూస్తున్నాడు ఎస్సై ప్రదీప్. ఆఖర్న నిలబడ్డ నా వంక చూసినప్పుడు సెకనుకంటే తక్కువ సమయంలో అతని నొసలు ముడుచుకుని కళ్ళు చిన్నవై అంతలోనే మామూలవడం, అతని చూపుల్లో చూపు కలిసిన నాకు తెలిసింది.మమ్మల్ని సెల్‌లోపెట్టి బయట తాళం వేయబోతున్న కానిస్టేబుల్ దగ్గరకి మరో కానిస్టేబుల్ వచ్చాడు. ‘‘ఇక్కడ శాంతి ఎవరు..? ఎస్సైగారు పిలుస్తున్నారు’’ అన్నాడు.జీప్‌లోంచి దిగుతూ అతని కళ్ళని చూసినప్పుడే ఇలాంటిదేదో జరుగుతుందని ఊహించాను.సెల్‌లోంచి బయటకొచ్చిన నన్ను ఒక కానిస్టేబుల్ ఎస్సై గదిలోకి తీసుకెళ్ళాడు. కానిస్టేబుల్‌ని బయటకు వెళ్ళమన్నట్టుగా చూశాడు ఎస్.ఐ. కానిస్టేబుల్ నన్ను ఓరగా చూస్తూ వెళ్ళిపోయాడు.‘‘మీ అన్నయ్య జైల్లో ఉన్నాడు కదా...’’ మెల్లగా అడిగాడు ఎస్.ఐ ప్రదీప్.‘‘అందుకేగా నేను ఇక్కడకు రావలసి వచ్చింది...’’ అన్నయ్య తలపు రావడంతో, మనసులో రేగిన ఆవేశంవల్ల కోపంగా బదులిచ్చాను.