‘‘నీ మూడెకరాలె మిగిలినయ్ ఆడ. అంతా పోనే పోయింది. సుట్టూ మైనింగ్ పెట్టుకోని, ఆ కాస్త బూవిలో ఏం పండిస్తా? ఆళ్ళేం తక్కువ ఇయ్యట్లా. పైగా ఇప్పుడు అంతా అయి పోయి నీ చేనొక్కటే మిగిలింది గదా? అందుకే డబల్ రేటిచ్చి తీసుకుంటామంటున్నారు. చేసినన్నాళ్ళు శాకిరీ చేశావు. ఇంగ జాల్లే అనుకోని ఆళ్ళిచ్చే డబ్బులు తీసుకోని చేను రాసిచ్చేసెయ్. ఎంత ఇస్తామన్నారంటే, ఓయబ్బో మీరిద్దరూ ఎంత గనంగా బతికినా, మీ తరవాత నీ కొడుక్కి కూడా రాసిచ్చే దానిగ్గూడా మిగిలే ఉంటయి’’ పొగాకు కాడలు పాయలు పాయలుగా చీల్చి ఒక పక్కన తీరుగా పెట్టాడు సుబ్బయ్య.‘‘నీకు వందసార్లు చెప్పాను. వాళ్ళకి నూట యాబై సార్లు చెప్పాను. ఆ చేను డబ్బు కోసం గాదు అమ్మకుండా ఉంచుకుందీ అని. మళ్ళీ మళ్ళీ అదే పాట పాడమాకండి’’ కంచం కింద పెట్టి నీళ్ళ గాబు దగ్గర చేతులు కడుక్కుని, కాలితో నీళ్ళు చెట్ల పాదుల్లోకి పోవడానికి దారి సరి చేసి, కాళ్ళు కూడా కడుక్కుని వచ్చి నవారు మంచం మీద కూచున్నాడు ఆంజనేయులు.వెన్నెల్లో అరుగు మీద కూచుని ఆంజనేయులూ, సావిత్రీ అన్నాలు తింటుండగా వచ్చాడు సుబ్బయ్య, మైనింగ్ కంపెనీ తరఫున మాట్లాడ్డానికి.సున్నపు రాయి గనుల కోసం ఆంజనేయులు చేను తప్ప ఆ చుట్టు పక్కల ఉన్న చేలన్నీ ఖతమైపోయి చాలా రోజులైంది. పంటలు లేని బీళ్ళుగా అవన్నీ మారి రెండేళ్ళయి పోయింది. మైనింగ్ పనులు మొదలు కాలేదు కానీ, ఆ భూములన్నీ కంపెనీ కిందే ఉన్నాయి. ఆంజనేయులు చేను కింద దండిగా సున్నపురాయి ఉందని తెలిశాక దాని మీద వాళ్ళ కన్ను పడటంలో ఆశ్చర్యమేముంది?‘‘ఆ బూవిలో ఇప్పుడు ఏవంత ఇరగ్గాసే పంటలు పండుతున్నయ్యని అంత బ్రెమ దాని మీద? ఈసారి గూడా మిరగాయలేశావు గావాల? వాళ్ళు కొన్న వందల ఎకరాలముందు ఈ మూడెకరాలు ఒక లెక్కలోయి కాదు. వాళ్ళ బూవుల పక్కనే నీ బూవి కూడా ఉంది గదా కలుపుకుంటే పోద్ది అని అడుగుతున్నారు’’ సుబ్బయ్య నచ్చజెప్పే ధోరణిలో అన్నాడు.
**************************