మోక్షకారణ్యంలో ప్రవహించే పవిత్రానది ఒడ్డున ఏకాగ్రతతో తపస్సు చేసిన వారికి భగవద్దర్శనమూ, మోక్షప్రాప్తీ త్వరగా సిద్ధించగలవని ప్రతీతి. అలాంటి కోరికతో ఒక ఋషి పవిత్రానది ఒడ్డున కూర్చుని తపస్సు ప్రారంభించాడు. కానీ, ఎన్నేళ్లు తపస్సు చేసినా దేవుడు ప్రత్యక్షం కాలేదు. దాంతో విసిగిపోయి ఆ నదిలో దూకి, చనిపోవాలని అనుకున్నాడు.అప్పుడు ఒక అందమైన యువతి అతడి ముందు ప్రత్యక్షమె, ‘‘చిన్నవయసులో తపస్సుకి పూనుకోవడంవల్ల, నీ శరీరానికి ఇంకా ఐహికసుఖాలపై మోజు తీరలేదు. నీ మనస్సులో ఏకాగ్రత లేదు. కొన్నాళ్లు మనుషుల మధ్య ఉండి సుఖాలు అనుభవించు. పూర్తిగా తృప్తి కలిగాక, మళ్లీ తపస్సు చేయి. దైవదర్శనం కాగలదు’’ అని ఆశీర్వదించింది.
‘‘నాకు ఐహికసుఖాలపై మోజులేదు. నాకున్నది దేవుణ్ణి చూడాలన్న కోరిక ఒక్కటే! నేను మనుషుల మధ్యకు వెళ్లను’’ అన్నాడు ఋషి పట్టుదలగా. ఆ యువతి నవ్వి, ‘‘తపస్సుకి పంచేంద్రియాల్నీ జయించాలి. నీకు అసహనం ఎక్కువ. నీవంటివాడికి దైవదర్శనం కాదు’’ అంది.‘‘నాగురించి నీకెలా తెలుసు?’’ అనడిగాడు ఋషి.‘‘నీ ఎదుట ప్రవహించే పవిత్రానదిని నేనే. విసుగు, విరామం లేకుండా నిరంతరం ప్రవహించే నేను సాగరుడితో కలిసేటప్పుడు, దేవుణ్ణి చూస్తాను. ఎవరికైనా విద్యుక్తధర్మాల్ని నిర్వహించడంలోనే దేవుడు కనిపిస్తాడు. తపస్సు అంటే అదే. నా మాట విను. వెళ్లి మనుషుల మధ్య జీవించు’’ అంది మానవరూపంలో ఉన్న పవిత్రానది.
ఋషి నదీమతల్లికి నమస్కరించి, ‘‘అమ్మా! నా శరీరం కోర్కెలతో వేధిస్తున్న విషయం నిజమే! కానీ, ఈ తనువు శాశ్వతంకాదని నాకు తెలుసు. అశాశ్వతమైన ఈ జీవితంలో మమకారాలు పెంచుకోవడం ఇష్టంలేక - మోక్షగామినై తపస్సు ప్రారంభించాను. భగవంతుడు ప్రత్యక్షమై నా కోరిక తీర్చకపోతే, నా ప్రాణాలు నేనే తీసుకుని, ఆయన్ని చేరాలని నా సంకల్పం. అర్థం చేసుకో. నన్ను ఆపవద్దు’’ అన్నాడు.‘‘వెర్రివాడా! శరీరానికి చావు సహజంగా రావాలి. బలవంతంగా ప్రాణం తీసుకుంటే, శరీరాన్ని అంటిపెట్టుకొని ఉన్న కోరికలు, నీ ఆత్మను పట్టుకుంటాయి. అప్పుడు నీవు బ్రహ్మరాక్షసుడవై భయంకరమైన జీవితం గడపాలి. నీకు అటువంటి గతి పట్టకూడదనే, ఇప్పుడు నేను కనపడి వారిస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా నిన్ను చూస్తున్నాగా, నాకు నీపై మమకారం పుట్టుకొచ్చిందిలే’’ అంది పవిత్రానది.