వెయ్యి తొంభై ఆరు మెట్లెక్కి వచ్చి ఈ దర్గా పక్కనకూర్చొని ఊరిని చూస్తూ ఉంటే, నీలం రంగు రేకులున్నపెద్ద థియేటర్ దగ్గర చూపు ఆగిపోతుంది. అక్కణ్నుంచిఇంటిని లెక్కేసుకుంటూ పోతాను.
ఇదంతా ఇలాగే జరిగి చాలాకాలం అయి ఉండాలి.మెయిన్ రోడ్డు మీదికి ఉన్న ఇంటి తలుపు తీసి మూడు మెట్లు దిగినా, అరుగు మీంచే దూకినా రోడ్డు మీద పడ్డట్టే. జేబులో ఇరవై ఆరు గోటీలున్నాయి. రోడ్డు మీదికొచ్చి కుడివైపు తిరిగి, చిన్న సందులోంచి పోతే, పోగా పోగా ఒక పెద్ద వేపచెట్టు వస్తుంది. దాని నీడ ఉన్నంత దూరం ఆడుకోవచ్చు. ఎండాకాలమది. మధ్యాహ్నం దాటింది.సంతోశ్గాడు జేబుల నిండా నింపుకున్నాడు గోటీలు. ఇంకొన్ని గోటీలు రెండు బాటిళ్లలో ఉన్నాయి. నేను ఒక్కో గోటీ పోగొట్టుకుంటూ ఉంటే, వాడు ఆ బాటిళ్లను ఊపి ఊపి వాటిని అందులోకి నూకుతున్నాడు.
నేను చివరి గోటీ కూడా పోగొట్టుకోగానే వాడు గట్టిగా నవ్వుతూ, ‘‘పిక్లాస్’’ అన్నాడు. నాకేం చెయ్యాలో అర్థం కాలేదు. అమ్మని అడిగితే, ‘‘నిన్ననే కొంటివిగారా’’ అని కొట్టనే కొడుతుంది.‘‘ఇంటికి పోదామిగ’’ అని లేచి నిలబడ్డా. వాడు జేబులు తడుముకుని, బాటిళ్లను మురిపంగా చూసుకుని నిలబడ్డాడు. అంతసేపు పాషా తాత ఆ చెట్టు కింద లేకపోవడం పెద్ద తేడాగా కనిపించలేదు కానీ, ఆ చెట్టు నీడను దాటి వెళ్లిపోయిన ఇంటికి మరో ఇల్లు దూరంలో ఉన్న పచ్చ తలుపు ఇంటి చుట్టూ జనం పోగవుతూ ఉంటే ఏదో జరుగుతోందని అర్థమైంది.
‘‘ఇంటికి పోదాం’’ అన్నాడు సంతోశ్గాడు. ‘సరే’ అన్నట్టు తలూపి ఇంటికి చేరగానే, చీర సర్దుకొని, రబ్బరు చెప్పులేసుకుంటున్న అమ్మ ‘‘ఏడ్నించి వస్తున్నవురా?’’ అనడిగింది.‘‘యాపచెట్టుకాడ్నే ఆడుకుంటున్నమే’’ అన్నాను.‘‘సరే! నువ్వీడ్నే ఉండు. నేనీ సందుకాడికి పోయొస్త’’ అంది అమ్మ.‘‘దేనికి? నేనుగుడొస్త.’’‘‘నువ్వొద్దులే! నేను పోయొస్త. పాషా తాత సచ్చిపోయిండంట’’ ఆ మాటంటూనే ఇంట్లోంచి కదిలింది అమ్మ.‘పాషా తాత సచ్చిపోయిండా?’ అని నేను ఒకే మాటను మూడుసార్లు నాకు నేనే చెప్పుకుని ఉండటం అమ్మ చూసి ఉండదు.