ఎన్ని దినాలాయనో మేనత్తూరికి వోక. నాయిన కాలం చేసినంక మేనత్తూరికి పోవడం ఇదే తొలిసారి. నాయిన తోడ నలుగురక్కల్లో అందరికంటే చిన్నది దేవక్క. దేవగన్య పుట్టుక. దోర నిమ్మపండు రంగు. ఎప్పుడు జూసినా పుదిచ్చిన బోనంకుండలాగ ఉంటది. ఊర్ల ఏ ఇంటి దగ్గరైనా ఒగ్గుకథ చెబుతున్నరంటే సాప, రగ్గు తీసుకొని పోయి అక్కడ్నే కథ వినుకుంట పడుకుంటది. కథ మధ్యలో పైసలు సదివిస్తుంటే కొంగుకు ముడేసుకున్న పది రూపాయలు దీసి కట్నం సదివిస్తది. సచ్చిపోయిన నాయిన కాన్నుంచి తమ్ముళ్ళ దాక అందరిని తల్చుకుంటది. దేవక్క అంటెనే ఆరివారం గల్ల పుట్టుక. వంద మేకలమందను ఒక్క చేతితోటి మలుపుకొచ్చేది ఒడుపుగా. దేవక్క చేయితీరు, మాట తీరు ఏందో గాని ఎక్కడికి పోయినా నాలుగు ఉప్పుగాళ్ళు పుడుతాయి.మా ఊరి నుంచి దేవక్కొళ్ళూరికి ఈ మధ్యన్నే పాల వ్యాను పోతోంది. ఊరూరు తిరుగుకుంట పోతే రెండు గంటల్ల ఆ ఊరికి పోతది. ఇంతకు ముందైతే లెస తిప్పలు పడేది. ఇంత చీకటున్నపుడే లేచి సద్దికట్టుకొని పోతే పన్నెండొకటి అయ్యేది పొయ్యెసరికి. ఇప్పుడు పాల వ్యాను దేవక్క ఇంటి ముందల్నే దించింది. మా ఇంటి దగ్గర ఆరింటికి బయలు దేరితే ఈడికొచ్చెవరకల్ల ఎనిమిదయ్యింది. గేటు తీసి చూస్తే తలుపు తాళమేసి ఉంది. అక్క దొడ్డి కాడికి పోయుంటుందని సక్కగా అక్కడికే పోయిన. ఇంటి కాన్నుంచి పదిండ్లు దాటితే అక్కోళ్ళ మేకలదొడ్డి వస్తది.పొయ్యేసరికి ఒక మొద్దు పొర్క తీసుకొని కూసోని దొడ్డి ఊకుతోంది దేవక్క. మేక గొతికెలు కుప్పలు కుప్పలుగా ఉన్నయి. మేకలు ఉచ్చవోసిన రొచ్చంతా ఆరలేదు. నిన్న మేక పిల్లల కోసం కొట్టుకొచ్చిన వేపమండలను ఒక దగ్గర ఏసింది. చెయ్యి తోటి ఒక దగ్గర కుప్ప నూకి తట్ట నిండ ఎత్తుతోంది. ‘‘అక్కా... ఎట్లున్నవు?’’ అని దొడ్డి తడక తీసుకొని లోపలికి పోయిన. ‘‘తొవ్వెట్ల దొరికింది తమ్మీ’’ అని చేతిల పొర్క కింద పడేసింది.‘‘మా ఊరికి రానీక ఇన్నాళ్ళకు కాళ్ళాడి నాయి’’ అనుకుంట చేతి పట్టుకోని కండ్ల నిండ నీళ్ళు తీసుకుంది. ‘‘మా తమ్ముండ్లకు మా మీద ప్రేముంటది గానీ మా తమ్ముండ్లంత ప్రేమ మీకెక్కడిదిరా? మా తమ్ముండ్లయితే నెలకొక్క సారైనా చూసి పోయేది’’ అనుకుంటనే ముగ్గురు తమ్ముండ్లను తల్చుకొని ఏడ్చింది. నాక్కూడా కడుపుల దుక్కం ఆగుతలేదు. కానీ, నేను ఏడిస్తే ఇంకెక్కువ ఏడుస్తదని ఊకించిన. ‘‘నీయమ్మా.. ఊకో, మీ తమ్ముండ్లు పోతే మేము లేమా, నీ ముగ్గురు తమ్ముళ్ళకు బదులు ముగ్గురికి ముగ్గురం ఉన్నం. మేము నీ తమ్ముండ్లమే అనుకో’’ అని దగ్గరకు తీసుకున్న.
*************************************************