‘నాన్నగారు పోయారు – నువ్వెక్కడున్నావు?’’ మొబైల్లో సుందర్ ప్రశ్న వినిపించగానే.‘‘ఇప్పుడే బయల్దేరుతున్నా – ఓ గంటలో వచ్చేస్తా’’ అని మొబైల్ ఆపేసి, కారెక్కి, డ్రైవర్తో సుందర్ ఇంటికి అనిచెప్పి, కళ్ళు మూసుకుని, సీటు వెనక్కి వాలిపోయి కూచున్నాను. పన్నెండేళ్ళ క్రితం సంఘటన కళ్ళ ముందు కనిపించసాగింది.
నాన్నగారు హటాత్తుగా పోతే ఏం చెయ్యలో పాలుపోలేదు నాకు. అప్పటికి ఓ రెణ్ణెల్ల క్రితమే – ఉద్యోగంలో చేరడానికి ముంబయి చేరుకున్నాను. కష్టపడి ఓ గూడు వెతుక్కుని అమ్మనీ, నాన్ననీ తీసుకొచ్చాను. తీసుకొచ్చిన పదిహేను రోజులకి ఓరోజు సాయంత్రం నేను ఆఫీసు నుండి ఇంట్లోకి అడుగుపెడుతున్నాను. నా దగ్గరకి పలకరింపుగా నవ్వుతూ వస్తూ వస్తూ కుప్పకూలి పోయారు నాన్నగారు.అలా ఒక మనిషి ప్రాణాలు ఉన్నట్లుండి పోవడం – అదీ ఆ మనిషి ఇన్నాళ్ళూ నాకు గురువుగా, స్నేహితుడిగా, హితుడిగా ఉన్న నాన్నగారు అవడం – ఆ బాధ మాటల్లో చెప్పగలిగేది కాదు. ఆ మనిషి మళ్ళీ మన దగ్గరికి రాని అనంత దూరాలకి వెళ్ళిపోయాడన్న భావం – అనుభవిస్తే కానీ అర్థం కాదు. ఐతే అంత బాధనూ అనుభవించడానికి కూడా తీరిక లేకపోయింది నాకు. ఆయన దహనసంస్కారం గురించి ఆలోచించాల్సి వచ్చింది నాకు.
ఏం చెయ్యాలో, ఎలా చెయ్యాలో తెలియలేదు నాకు. తెలియని ఊరు. తెలిసిన వాళ్ళెవ్వరూ లేరు. అపార్ట్‌మెంట్‌లో పక్కన ఉన్న వాళ్ళతో ఇంకా పరిచయమే అవలేదు. చాలామంది కొలీగ్స్ అడ్రెస్సులూ, ఫోన్ నంబర్లూ నా దగ్గర లేవు. ఉన్న వాళ్ళు కూడా తెలుగువాళ్ళు కాదు. ఐనా వాళ్ళకే ఫోన్లు చేసాను కానీ, ఎవ్వరికీ తెలుగు వాళ్ళ దహన సంస్కారం గురించి తెలియదు.వాళ్ళలో ఒకరు మాత్రం ‘‘మాటుంగాలో శంకరమఠం దగ్గర చాలామంది బ్రాహ్మణులు కూచుని ఉంటారు. వాళ్ళు దహన సంస్కారానికి కావల్సిన పనులన్నీ చేసిపెడతారని విన్నాను – ప్రయత్నించి చూడండి’’ అని సలహా ఇచ్చారు.నాన్నగారి శరీరాన్ని అమ్మకి అప్పచెప్పి, నేను మాటుంగా శంకరమఠానికి చేరుకున్నాను. నేను వెళ్ళేసరికి సాయంత్రం ఏడైపోయింది. మెట్లమీద ఎవ్వరూ కూచుని లేరు. మఠంలోంచి బయటికి వస్తున్న ఒకరితో నాబాధ వివరించుకున్నాను. అంతా ఓపిగ్గా విని ఆయన–