రైలు స్టేషన్‌లో ఆగింది.శ్రీపతి, లక్ష్మితోకలిసి లగేజి తీసుకుని రైలుదిగడానికి భారంగా అడుగులువేశాడు. జనం తోసుకుంటున్నారు. వృద్ధులు, స్త్రీలు, పిల్లలు అనే విచక్షణలేకుండా, దిగేవాళ్ళని దిగనివ్వకుండా, ఎక్కేవాళ్ళు అడ్డదిడ్డంగా చొరబడుతున్నారు. అతి కష్టంమీద వాళ్ళిద్దరూ బైటపడ్డారు. ఇరవై నిమిషాలు విజయవాడలో రైలు ఆగుతుంది. ఇంజిన్ అటుదిటు మార్చుకోడానికి. అయినా తొందరెందుకో. కంగారుగా ఖాళీసీట్లు ఆక్రమించకుని ‘స్టాండిగ్ కోటా తప్పించుకోడానికే’, ఈ భూమ్మీద మనస్థానం ఎంతకాలమో తెలీని అజ్ఞానంలో ఉంటూ తాత్కాలికమైన చోటుకోసం తాపత్రయపడిపోతున్నారు జనం. పక్కస్టేషన్‌లో దిగిపోవల్సినవాడిక్కూడా తను కూర్చున్న ‘చోటు’ జీవితాంతం ఉండిపోవాలన్నంత ఆశ! నిర్లిప్తంగా నవ్వుకున్నాడు శ్రీపతి.
లక్ష్మి భర్తభుజం తట్టి ‘‘అరె అన్నయ్య వస్తున్నాడు’’ అంది ఆశ్చర్యంగా. పాపారావు జనసమూహాన్ని చీల్చుకుంటూ వాళ్ళకి ఎదురొచ్చాడు. ‘‘బావా ఆగు ఊళ్ళోకి రాకు’’ అన్నాడు కంగారుగా.ఇద్దరూ మొహాలు చూసుకుని ‘‘ఏం జరిగింది’’ అన్నారు.‘‘చెబుతా జనాన్ని వెళ్ళిపోన్విండి. రండి అలా సిమెంటుబెంచీ మీద కూర్చుందాం’’ అని సూట్‌కేస్ అందుకుని అటు నడిచాడు. ఇద్దరూ అతన్ని అనుసరించారు.ప్లాట్‌ఫాం మెల్లగా పలచబడుతోంది.‘‘అబ్బాయి, కోడలు కులాసాయేనా’’ అడిగింది లక్ష్మి.
‘‘ఎందుకుండరు? అజ్ఞాతంలో ఎక్కడో కులాసాగా కులుకుతూ ఉండివుంటారు.ప్రజలడబ్బు చేతిలో ఉందిగా’’ అన్నాడు.‘‘వివరంగా చెప్పు తమ్ముడూ’’ అంది లక్ష్మి పాపారావుని కుదుపుతూ.‘‘ఏం చెప్పను అక్కా! మీ ఇద్దర్నీ తీర్థయాత్రలకు పంపించి మీ కొడుకు కోడలు చిట్టీల డబ్బుతో ఉడాయించారు. ఎక్కడో హాయిగా ఉండనే ఉంటారు. ఇక్కడ డబ్బు దాచుకున్నవాళ్ళు లబోదిబో అంటున్నారు. మీరు ఇంటికి వస్తే ప్రజలు మిమ్మల్ని చుట్టుముట్టి రాబందుల్లా పీక్కుతింటారు.శ్రీపతి తల పట్టుకున్నాడు.