ప్రపంచంలోని అన్ని రాజ్యాంగాలనూ పరిశీలించి వాటిలోని అంశాలను తీసుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు రాజ్యాంగ నిర్మాతలు. అందుకే ప్రపంచంలో అన్నింటికంటే మనదే అత్యుత్తమ రాజ్యాంగంగా పేరు పొందింది. కానీ రాజ్యాంగంలో ఏముందో, ఈ చట్టాలద్వారా తమను తాము ఎలా కాపాడుకోవాలో, తెలియకపోవడంవల్ల సామాన్య ప్రజలు ఇంకా చీకట్లోనే బతుకులీడుస్తున్నారు. ఈ కథలో కూడా ఇలాగే ఏం జరిగిందంటే.......

నాగరికతకు దూరంగా ఉన్న ఓ గిరిజన ప్రాంతం.పురివిప్పుకున్న ప్రకృతి సోయగాలనడుమ రమణీయంగా విలసిల్లుతున్న గ్రామం.బ్యాంక్‌లోంచి బయటకు వచ్చింది నందిని. ఆ రోజు పని ఎక్కువగా ఉండడంవల్ల ఆలస్యమైపోయింది. షెడ్‌లోంచి సైకిల్‌ తీసుకుంటూ అప్రయత్నంగా గేటువైపు చూసింది. బయట బాటకు ఆవలివైపు రావిచెట్టుకింద సైకిలేసుకుని గణేశ్‌ నిలబడి ఉన్నాడు. ముసిముసిగా నవ్వుకుంది నందిని. ఇద్దరూ సైకిళ్లు తొక్కుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ బయలుదేరారు.

నందిని ఇరవైమూడేళ్ల అందమైన ఆడపిల్ల. ఏడాదిక్రితమే ఆ ఊరు గ్రామీణబ్యాంక్‌లో అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరింది. గణేశ్‌ కూడా హ్యాండ్సమ్‌గా ఉండే పాతికేళ్ల కుర్రాడే. ‘విలేజ్‌ వర్కర్‌’.ఆర్నెల్లక్రితం ఆ బ్యాంక్‌లో పర్సనల్‌ లోన్‌ కోసం వెళ్ళిన గణేశ్‌కి నందిని సహాయం చేసింది. అప్పటినుంచీ ఇద్దరికీ స్నేహం.నందిని ఇల్లు బ్యాంక్‌కి కాస్త దూరం. ఆ అటవీప్రాంతంలో చీకటిపడ్డాక ఒంటరి ప్రయాణం కష్టమే. అందుకే బ్యాంక్‌లో ఆలస్యమైనప్పుడల్లా గణేశ్‌ బ్యాంక్‌నుంచి ఇంటివరకూ ఆమెకు తోడుగా వెళతాడు. ‘‘మా నందిని ఒట్టి పిరికిపిల్ల. ఎలా బతుకుతుందో ఏమో!’’ అంటూంటాడు నందిని తండ్రి సీతారామరాజు.గోదావరిజిల్లాకి చెందిన సీతారామరాజు ఓ ప్రభుత్వపాఠశాల ప్రధానోపాధ్యాయుడు. నందిని ఒక్కతే ఆయన సంతానం. డిగ్రీపాసై బ్యాంక్‌ పరీక్షలు రాసిన నందిని ఆ గిరిజనప్రాంతంలోనే పోస్టింగ్‌ అనేసరికి, అంతగా ఉత్సాహం చూపించలేదు. కానీ కూతురు ఆ ఉద్యోగాన్ని వదులుకోవడం తండ్రికి ఇష్టంలేదు. పిల్ల ఉద్యోగంలోచేరితే వీలైనంత త్వరలో మంచి సంబంధంచూసి వివాహం జరిపించేయవచ్చని ఆయన ఆలోచన. మరో మూడేళ్ళు సర్వీస్‌ ఉన్నాగానీ, కూతురు కోసం వాలంటరీ రిటైర్మెంట్‌ తీసుకుని కుటుంబంతోసహా ఈ ఊరుకి మకాం మార్చేశాడు. ఖాళీగా కూర్చోలేక గిరిజన పిల్లల్ని చేరదీసి తన ఇంటి దగ్గరే కాలక్షేపంకోసం చదువు చెబుతున్నాడు.