ఒక కొండగుహలో రాక్షసదంపతులు కాపురం ఉండేవారు. భార్య అంటే అతడికి ఎంతో ప్రేమ. ఆమె అడిగిన ప్రతి కోరికా తీర్చేవాడు. అందుకోసం ఎన్ని కష్టాలు, ఇబ్బందులూ వచ్చినా లెక్కచేసేవాడు కాదు. రాక్షసి ఓసారి చిత్రమైన కోరిక కోరింది. దాంతో రాక్షసుడు మారువేషంలో ఒక గ్రామానికి చేరుకున్నాడు. కుటుంబయ్య అనే ఆసామి ఇంటికెళ్ళి రహస్యంగా అటక ఎక్కాడు. రాక్షసుడు ఎందుకు అటకెక్కాడు? అప్పుడు ఏం జరిగింది?
దండకారణ్య ప్రాంతంలోని ఓ కొండగుహలో ఓ రాక్షసుడు, రాక్షసి కాపురం చేస్తుండేవారు. రాక్షసుడు మహా శక్తిసంపన్నుడు. అతడికి భార్య అంటే అమితమైన ప్రేమ. అయితే రాక్షసి పరమగయ్యాళి. భర్తకు రోజూ కష్టమైన పనులుచెప్పి వేధించేది. భార్యమీద ప్రేమతో రాక్షసుడు ఆ పనులన్నీ చేసేవాడు.తనకు చతురిక పుష్పాలు కావాలని రాక్షసి ఒకసారి భర్తను అడిగింది. రాక్షసుడికి చతురిక పుష్పాలు ఎలా ఉంటాయో, ఎక్కడుంటాయో తెలియదు. అతడు వాటికోసం వారంరోజుల పాటు ప్రపంచం అంతా గాలించి, ఎలాగైతేనేం సంపాదించి తెచ్చాడు.ఒకొక్కసారి రాక్షసి బాగా ఇబ్బందిపెట్టే పనులు చెబుతుండేది. ఒకరోజు ఓ బండరాయి చూపించి, ‘‘నాకో లేడిపిల్ల కావాలి. అది బ్రతికుండాలి. సరిగ్గా ఈ బండరాయంత బరువే ఉండాలి.
చిన్నమెత్తు ఎక్కువగానీ, తక్కువగానీ ఉండకూడదు. వెళ్ళి తీసుకురా’’ అని భర్తకు చెప్పింది. రాక్షసుడు ఇబ్బందిలో పడ్డాడు. లేడిపిల్లను చంపి తెమ్మంటే చిటికెలమీద పని. కానీ బ్రతికి ఉన్న లేడి చేతికి దొరకడమే కష్టం. ఒకవేళ ఎలాగో అలా పట్టుకున్నా, ఆ తర్వాత దాన్ని తూకం వేయాలికూడా. మరి బ్రతికున్న జంతువును తూకంవేసేదెలా? తక్కెడలో వేస్తే అది పారిపోతుంది కదా!పాపం! రాక్షసుడు చాలా ఆలోచించి, చివరకు ఓ తెలివైన పథకం వేశాడు. ఓ తక్కెడ తయారుచేసి అడవిలో వేలాడతీశాడు. తక్కెడకు ఓ పళ్లెంలో బంకజిగురు పూశాడు. తక్కెడ రెండువైపులా సరిసమానంగా ఉన్నదని ధ్రువపర్చుకున్నాక, రాక్షసుడు ఆ జిగురులేని పళ్లెంలో భార్య చూపిన బండరాయిని ఉంచాడు.
ఆ తర్వాత లేడి పిల్లల్ని బెదిరించి రెండోపళ్లెంలోకి చేరేలా తరిమేవాడు. పళ్లెంలో ఉన్న జిగురుకి అంటుకున్న లేడిపిల్ల కదలలేకపోయేది. దాని బరువు తేడాగా ఉంటే, దాన్ని విడిపించి వదిలేసేవాడు రాక్షసుడు. అలా పదిరోజులు గడిచాక- ఒకరోజున అతడికి సరిగ్గా బండరాయి అంత బరువున్న లేడిపిల్ల దొరికింది. భార్య అతడి ప్రయత్నాన్నీ, తెలివినీ, ప్రేమనీ మెచ్చుకుంది. రాక్షసుడు పొంగిపోయాడు. కొన్నాళ్లు సంతోషంగా గడిచిపోయాయి. మళ్ళీ ఒకరోజు రాక్షసి భర్తతో, ‘‘మాంసం తిని తిని విసుగుపుట్టింది. ఇప్పుడు నాకు వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకుని తినాలని ఉంది. అన్నమైతే మనమే వండుకోగలం. కాని, ఆవకాయమాత్రం మనుషుల దగ్గరనుంచి తెచ్చుకోక తప్పదు. ఆ పని నువ్వే చెయ్యాలి.
ఐతే ఇలా అన్నానని, ఏదో ఒక ఇంటికెళ్ళి ఆవకాయ ఎత్తుకుని రావడం కాదు. తెచ్చిన ఆవకాయ చాలారుచిగా ఉండాలి’’ అని చెప్పింది. అంతకుముందు చేసిన పనులతో పోల్చితే- రాక్షసుడికి ‘ఇదీ ఒక పనేనా’ అనిపించింది. చాలా సునాయాసంగా సంపాదించగలననుకున్నాడు. ఆవకాయకోసం రాక్షసుడు వెంటనే బయలుదేరి ఓ గ్రామం చేరుకున్నాడు. మనిషిరూపం ధరించి ఊళ్లోకెళ్లాడు. ఆవకాయను రుచికరంగా పెట్టుకోవాలంటే ఏంచెయ్యాలని తనకు ఎదురుపడ్డవారిని అడగడం మొదలెట్టాడు. ‘‘ఆవకాయ పెట్టడం బ్రహ్మవిద్యేమీకాదు, కానీ కుటుంబయ్య ఇంట్లో ఆవకాయ తింటేమాత్రం అది బ్రహ్మవిద్యే అనిపిస్తుంది. అంత గొప్పగా ఉంటుంది ఆ ఇంటి ఆవకాయ’’ అని చాలామంది అతనికి చెప్పారు.