‘చట్టబద్ధమైన లైంగికాధీనత శుద్ధ తప్పు’-.. జాన్ స్టువార్ట్ మిల్..
**************
ఆ అబ్బాయి బాగుంటాడు. కొంచెం ఎర్రగా ఉండి చురుగ్గా చూస్తుండే ఆ ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఎప్పుడు రెప్ప కొడతాయో తెలీదు. సూటిగా కొనదేలిన ముక్కు తిన్నగా వెళ్ళమని చెబుతుంటుంది. బీట్‌రూట్ రంగు ఒత్తైన గిరజాల జుట్టు అతడు నడుస్తుంటే భుజాల మీద ఎగిరెగిరి పడుతూ దూకుడు మీదుంటుంది. చిక్కటి పసుపువన్నె చర్మం కేక్ మీద పోసిన కారమెల్ లాగా పారదర్శకంగా ఉన్నట్టు ఉంటుంది. ఆ పొడవాటి వేళ్ళు నీటిలో ఈదే బాతు కాళ్ళలా చకచకా కదులు తుంటాయి. కొంచెం మందపాటి తేనెలూరే గులాబీ పెదాలు తడితడిగా మెరుస్తుంటాయి..ఇంకా చాలా ఉంది. సిగ్గు లేకుండా ఇలాగే రాసింది - అంగాంగమూ వర్ణిస్తూ.
నాలో అసూయ నిప్పులై మండింది. లావా అయి పొంగింది. పళ్ళు పటపటా నూరాను. ఎంత ధైర్యం దానికి? నా గురించి కాక వేరేవాళ్ళ గురించి ఆలోచిస్తుందా? అసలు మాకు పెళ్లయిందని దానికి గుర్తుందా? వద్దన్నా వినకుండా ఉద్యోగం వెలగబెడుతోంది ఇందుకన్నమాట! డైరీని పరుపు మీద గిరవాటు వేసి దిండుని కాలి కింద వేసి కసిదీరా తొక్కాను. ఎన్నాళ్ళ నుంచి సాగిస్తోందో ఈ మానసిక రాసరికం?! అవర్ గ్లాస్ బాడీ దానిది. నా ‘ఏ’ లైన్ బాడీ బానే ఉంటుందిగా. ఆ ‘వి’ షేప్ గాడి కోసం దానికెందుకింత తీపరం? ఇవాళ వాడో నేనో తేలిపోవాలి!
ఒకప్పుడు మా ఇద్దరి ప్రేమలో ఒక ఫర్వెన్సీ ఉండేది. తన్మయత్వం, సమానత్వం, మూర్ఖత్వం, అమాయకత్వం, పారవశ్యం, ఉన్మత్తత. అయితే గత కొన్నాళ్లుగా - ఉదాసీనత, నిర్బలత, అనిష్టత, అసహ్యత, రోత. ఏమిటయ్యిందో తెలీదు. నోరు తెరిచి చెప్పదు. గట్టిగా అడిగితే వేల సంవత్సరాల నుంచి దాచుకున్న విషాదం గుప్పెట తెరిస్తే ఒలికిపోతుందేమో అన్నట్టు ఒకటీ అరా కన్నీటి చుక్కలు. ఏడ్చేయచ్చుగా - తేలికపడటం కోసం. అహఁ.. ఆ విషాదాన్ని తలచుకొని కుమిలి కుమిలి కుళ్ళి క్రుంగి కృశించి పోవాలి.