ఆ ఊరికి దూరంగావున్న ఓ పాడుబడిన బంగ్లాముందు ఊరి జనమంతా గుమిగూడి ఉన్నారు. ఇంకా వచ్చేవాళ్ళు వస్తూనేవున్నారు. అంతలో రెండు పోలీసు జీపులు, ఓ అంబులెన్సు అక్కడికి వచ్చి ఆగాయి. జీపుల్లోనుంచి పోలీసులు దిగారు. ముందు జీపులోనుంచి దిగిన డి.ఎస్పీ, సి.ఐ బంగ్లాలోపలికెళుతుంటే రెండో జీపులోనుంచి దిగిన కానిస్టేబుళ్ళు అక్కడి జనాలను కంట్రోలు చేస్తున్నారు. వాళ్ళనుచూసి చాలామంది ఎందుకైనా మంచిదని కొంచెందూరంగాపోయి నిలబడ్డారు.
పోలీసులడిగే ప్రశ్నలకు ఏం చెప్పవలసివస్తుందోనని కొంతమంది పక్కకు తప్పుకున్నారు. బిల్డింగులోనుంచి వస్తున్న దుర్గంధం భరించలేక మరికొంతమంది దూరంగాపోయి అక్కడ జరుగుతున్న తతంగం చూస్తున్నారు. పోలీసులంతా ఆ వాసనభరించలేక ముక్కులకు స్కార్ఫ్‌లు చుట్టుకున్నారు. కాస్సేపటికే అక్కడకు ఫోటోగ్రాఫరు, వేలిముద్రల నిపుణులు, సాక్షాధారాలు సంపాదించే ‘ఆచూకీ బృందం’ (క్లూస్ టీమ్) వేరు వేరు వాహనాల్లో వచ్చింది.ఆ వార్డు కార్పొరేటర్ వీళ్ళంతా వస్తారని ముందుగానే అక్కడ కుర్చీలు వేయించివుంచాడు. అంతా కూర్చున్నాక డి.ఎస్పీగారు ఓ వ్యక్తిని పిలిపించారు.
అతను చేతులు కట్టుకుని భయపడుతూ ఆయన ముందుకొచ్చాడు. అతనికి అరవైఏళ్లుంటాయి.‘‘ఏం జరిగిందో చెప్పు’’ అనడిగారతన్ని. ‘‘నా పేరు సూరయ్యంటారయ్యా. ఈ బంగ్లాకి వాచ్‌మన్‌గా ఉంటున్నాను. మూడురోజుల క్రితం నా కూతురికి బాగోలేదని తెలిసి దాన్ని చూడ్డానికి పక్కూరికెళ్ళి ఈ పొద్దున్నే వచ్చానయ్యా. ఇక్కడికొచ్చేసరికి లోపలినుంచి ఏదో వాసన వస్తోంది. తలుపులు తీసి చూస్తే ఓ గదిలో ఓ ఆడా, మగా ఉరితీసుకుని ఏలాడుతూ కనిపించారయ్యా. భయంతో బయటకొచ్చి తలుపులేసేని మన కార్పొరేటరుగారి దగ్గరికెళ్ళి చెప్పానయ్యా. ఆయన మీకు ఫోను చేశారు’’ అని చెప్పాడతను.