అప్పటివరకూ నిద్ర నటిస్తున్న నేను కళ్ళు తెరచిచూశాను. చుట్టూ చీకటి.నాకు ఎడంపక్కన గాఢనిద్రలో వాసంతి. తను బలంగా ఊపిరి తీసుకుంటున్న శబ్దం. పాము బుసలా...చంపేయాలి. తనవల్ల నేను పడుతున్న చిత్రవధని భరించేఓపిక చచ్చిపోయి చాలారోజులైంది. మెల్లగా కుడిచేతిని తన గొంతు దగ్గరకు తీసుకెళ్ళాను. ఎడంచేత్తో నోరునొక్కి, కుడిచేత్తో గొంతుపిసికితే చాలు. చచ్చి ఊరుకుంటుంది. ఎన్నాళ్ళని తన బరువుని నడుంమీదమోస్తూ తిరగాలి? నాకిప్పుడు పదహారేళ్ళు. కోరికలన్నీ రంగురంగుల రెక్కలువిప్పి స్వేచ్ఛగా ఎగరాలనుకునే వయసు. నాకూ స్వేచ్ఛ కావాలి. వాసంతి నుంచి స్వేచ్ఛ. నా నడుముని ఉడుంలా బంధించి ఉంచిన సంకెళ్ళ నుంచి విముక్తి కావాలి. శాశ్వతంగా విముక్తి.

ఎడం చేతిని దానినోటిమీద మెల్లగా ఆనించాను. తనలో కదలిక లేదు. శబ్దం బైటికి రాకుండా గట్టిగా నొక్కబోతున్న క్షణంలో ‘‘అక్కా... ఏం చేస్తున్నావు?’’ అని వాసంతి గొంతు వినిపించింది. చప్పున చేయి తీసేసి ‘‘అబ్బే... ఏం లేదు... ఏదో పీడకల’’ అన్నాను. ‘‘ఈమధ్య నీకు రోజూ పీడకలలు వస్తున్నట్టున్నాయక్కా, నిన్ను చూస్తుంటే భయమేస్తోందక్కా’’ అంది వాసంతి.‘‘భయమెందుకు? పడుకో’’ అన్నాను.‘అక్కట అక్క. అక్క ఎలా అయ్యాను? చెల్లెల్ని కూడా కావచ్చుగా. ఇద్దరం పుట్టిన సమయం ఒకటేగా. మొదట నేను ఏడ్చానట.

తర్వాత వాసంతి...అందుకే నన్ను అక్కగా తనని చెల్లిగా అమ్మానాన్న అనుకుని ఉంటారు. తన శరీరంకన్నా నా శరీరం పెద్దది కాబట్టి కూడా కావచ్చు. తను నామీద ఆధారపడి బతకుతున్నందువల్ల కావచ్చు. తనకున్నది సగం శరీరమేగా. నడుమునుంచి పైకి...నడుము కిందినుంచి ఇద్దరం కలిసిపోయి... ‘‘అది మీ ఇద్దరిదీను, సగం సగం అన్మాట’ అంటుంది అమ్మ. నేనొప్పుకోను. అది నాదే... పూర్తిగా నాది. నడుము, కటివలయం, కాళ్ళూ....కేవలం నావే. వాసంతి నా భాగాల్ని వాడుకుంటోంది. నా కాళ్ళతో నడుస్తోంది... పరాన్నభుక్కులా నామీద పడి బతుకుతోంది.