అద్దం ముందు నిలబడింది శారదాంబ.ఎప్పుడూ కనిపించే ప్రతిబింబమే. డెబ్భై సంవత్సరాల వయసుకి తగ్గట్లు ముడతలు కనిపిస్తున్నా, తన చెరగని చిరునవ్వు జీవితాన్ని వడపోసిన అనుభవాన్ని చూపిస్తోంది.అక్కడినుంచి కదిలి వంటింట్లోకి వెళ్ళింది కాఫీ పెడదామని. కాదూకూడదూ అనుకున్నప్పటికీ చెంగల్‌రాయుడూ, వందనా ఆమెకు గుర్తుకొస్తున్నారు. వారంరోజులక్రితం సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌లో వైజాగ్‌కి వస్తున్నప్పుడు పరిచయమయ్యారు. ఏసీ కంపార్ట్‌మెంటులో కూర్చున్నా కూడా చెమటలు పడుతున్నాయి ఆయనకు. పక్కనే ఆయన కూతురు వందన కూర్చుని ఉంది.

తండ్రిని చేతితో తాకి ‘‘అప్పా! ఇప్పుడెలా ఉంది?’’ అడిగింది ఆమె.‘‘ఫర్వాలేదు అదే సర్దుకుంటుంది’’ నెమ్మదిగా సమాధానమిచ్చాడు.‘‘మీరు ఉండేది ఎక్కడ?’’ పరిచయం చేసుకుంటూ అడిగింది శారదాంబ. అలా మాటలు కలిశాయి. చెంగల్‌రాయుడుది గుంటూరు. ఒక్కతే కూతురు. హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా చేస్తోంది. సెలవులు తీసుకుని, కొన్నిరోజులు గుంటూరులో ఉండి పనిమీద వైజాగ్‌ వస్తున్నారు.‘‘నా మనవడు కూడా హైదరాబాద్‌లోనే ఉద్యోగం చేస్తున్నాడు. ఏడు సంవత్సరాల సర్వీసు ఉందతనికి’’ చెప్పింది వాళ్ళకు.‘‘అలాగా...పేరు?’’ అడిగింది వందన.‘‘కారుణ్య’’‘‘ఓ! అలాంటి పేరున్నవ్యక్తి మా క్రింది అంతస్తులో ఉన్నాడు. కొద్దిగా బొద్దుగా మధ్యస్తం ఎత్తులో!’’ చెప్పింది వందన.

శారదాంబ కళ్ళు మెరిశాయి. ‘‘కారుణ్య’’ పేరు వినబడితే చాలు. రాత్రివేళల్లోని మిణుగురు పురుగులే అవుతాయి ఆమె కళ్ళు.తన హ్యాండ్‌ బ్యాగ్‌లోంచి ఒక పోస్టుకార్డుసైజు ఫొటో తీసింది శారదాంబ. వందనకు చూపించింది.‘‘ఇతనే, నేనన్న కారుణ్య’’ అంది వందన.మిణుగురులు మరోసారి మెరిశాయి.‘‘ఇతను రెండవ అంతస్తులో ఉంటాడు. నేను మూడవ అంతస్తులో ఉంటాను. ఒకరితో ఒకరు మాట్లాడుకున్నాం కూడా’’ చెప్పింది వందన.‘‘వీడు నా దగ్గరే పెరిగాడు. నా కూతురుబిడ్డ. వీడికి ఏడేళ్ళప్పుడు నా కూతురూ, అల్లుడూ ఒక రోడు ప్రమాదంలో కాలంచేశారు. అప్పటినుంచీ వాణ్ణి నేనే చూసుకుంటున్నా. మావాడని చెప్పడం కాదుగానీ కారుణ్య చాలా బుద్ధిమంతుడు’’ అంది శారదాంబ.