‘‘పదిహేనురోజులు ఊరు వెళుతున్నాను. ప్రత్యేకంగా వాడవలసిన మందులు ఏమైనా ఉంటే రాసిస్తారా డాక్టరుగారూ!’’ అడిగారు కామేశ్వరరావు. ఆయన వయసు సుమారు డెబ్భైఏళ్ళు. బి.పీ, షుగరూ ఉన్నాయి అతనికి.‘‘ఎప్పుడూవాడేవే వాడండి. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చెయ్యండి. ఫోన్లోనే చెప్పేస్తాను. ఇంతకీ ఏ ఊరు వెళుతున్నారు?’’ అడిగాను.
‘‘సూర్యాపేట. అక్కడ మా అల్లుడూ, కూతురూ ఉంటారు. అల్లుడు ఆ ఊళ్ళో మెజిస్ట్రేట్’’.సూర్యాపేట పేరు వినేసరికి నాకు మా మాస్టారు గుర్తుకొచ్చారు.‘‘సూర్యాపేట అయితే నాకొక సహాయం చేసిపెడతారా!’’ అడిగాను.‘‘భలేవారే! మీరు అడగండి. చెయ్యగలిగితే తప్పకచేస్తాను’’ అన్నారు.‘‘ఉదయవర్లు అని నా చిన్నప్పటి మాస్టారు, పదవీవిరమణ తర్వాత అక్కడ స్థిరపడ్డారని తెలిసింది. ఐదుసంవత్సరాలనుంచీ ఆయన అడ్రస్‌కోసం ప్రయత్నం చేస్తున్నాను. దొరకలేదు. అల్లుడు మెజిస్ట్రేట్ అంటున్నారు కాబట్టి, చాలా పరపతి ఉంటుంది. మాస్టారుగారి ఎడ్రసు కనుక్కోగలిగితే నాకు తెలియజెయ్యండి. చాలా సహాయం చేసినవారవుతారు’’ అన్నాను.మాస్టారుగారిని తలచుకోగానే మనసులోపలిపొరల్లో పదిలంగావున్న బాల్యస్మృతులు కళ్ళముందు కదలాడసాగాయి.
స్కూల్లోచేరిన మొదటిరోజు అన్నయ్య నన్ను వెంటబెట్టుకుని స్కూలుకి తీసుకెళ్ళాడు. క్లాసుముందు వరండాలో ఇద్దరం నిలబడ్డాం. కొత్తస్కూలు, కొత్తవాతావరణం. దాంతో భయమూ, బెరుకూ ముప్పిరిగొన్నాయి. అప్పటికే ప్రతిసంవత్సరం నాన్నగారి బదిలీలవల్ల చాలా ఊళ్ళూ, స్కూళ్ళూ మారాను. మారినప్పుడల్లా ఇదే పరిస్థితి.మాస్టారు బోర్డువైపు తిరిగి, ఏదోరాస్తూ పాఠం చెబుతున్నారు. విద్యార్థులవైపు తిరగగానే, వరండాలో మేం కనిపించాం. మాస్టారు అన్నయ్యనుచూసి వరండాలొకొచ్చి, ‘‘ఏరా! ఇలా వచ్చావ్! స్కూలు గుర్తుకొచ్చిందా?’’ అన్నారు నవ్వుతూ.‘‘సార్! వీడు నాతమ్ముడు. నాన్నగారికి ఈ ఊరు బదిలీ అయింది. ఈ స్కూల్లోనే జాయిన్ చేశాను. మిమ్మల్ని పరిచయం చేద్దామని తీసుకొచ్చాను’’ అన్నాడు అన్నయ్య.‘‘ఏ క్లాసు చదువుతున్నాడు? పేరేమిటి?’’ అడిగారు.
‘‘ఏడో క్లాసు. పేరు అధర్వణ్’’’‘‘సరే క్లాసులో కూర్చోమను. తర్వాత మాట్లాడతాను. వాడిసంగతి నాకొదిలేయ్’’ అంటూ క్లాసులోకి వెళ్ళిపోయారు. ఆయన నవ్వుమొహం చూడగానే కొత్తదనమూ, బెరుకూ కాస్త పోయాయి.రెండోరోజు స్కూల్లో ప్రార్థన పూర్తయ్యాక క్లాసురూంలోకి వెళుతూ ఉండగా మాస్టారు నా దగ్గరకువచ్చి ‘‘ఒరేయ్! నా పేరు ఉదయవర్లు. నేనే మీ క్లాసు టీచర్ని. అన్నయ్య నా అభిమాన శిష్యుడు. ఇంత ప్రత్యేకంగా నిన్నుతీసుకొచ్చి నాకు అప్పజెప్పాడుకాబట్టి నువ్వు బాగా చదువుకుని అన్నయ్య కంటే పైకి రావాలి. నాక్కూడా పేరు తీసుకురావాలి. మధ్యాహ్నభోజన విరామసమయంలో హెడ్‌మాస్టారు రూంలోకివెళ్ళి, ఆయనవెనక బోర్డుమీద ఏంరాసి ఉందో చదివిరా, సాయంత్రం స్కూలునుంచి వెళ్ళేముందు నన్ను కలుసుకో’’ అన్నారు.