ఇక్కడికొచ్చిన నెల రోజుల్లో తెన్నేటి పార్క్‌కి రావడం దాదాపుగా ఇది పదోసారి. ఆ అమ్మాయిని చూడ్డం కూడా. పేవ్‌మెంట్‌ పక్క నుంచి పార్క్‌ లోపలికి వచ్చే మెట్ల పక్కన, నేల మీదకి వంగినట్లున్న బాదం చెట్టు నీడలో రాతి సోఫాలో కూర్చుని వుందామె. చుట్టూరా జనాల్ని పరీక్షిస్తూనే అప్పుడప్పుడూ మెడ వెనక్కి తిప్పి రోడ్డు వేపు చూస్తోంది.కళ్ళతోనే ఓ పరిచయపు నవ్వు విసురు కోవడం మూడోసారి నుంచో నాలుగోసారి నుంచో మా మధ్య మొదలై, ఇప్పటికి కాస్త పెదవి విచ్చుకునే దాకా ఎగబాకింది. బ్యాగ్‌ లోంచి సిగరెట్‌ తీసి, నా చూపుల్లో కాస్త చురుకు చూసి మళ్ళీ లోపల పెట్టేసింది.నేను వైజాగ్‌ వచ్చి నెలరోజులు. నా లోపల కురుస్తున్న వర్షాన్ని సముద్రం మాత్రమే ఇంకించుకోగలదు. ప్రేమ చేసిన గాయాలు, నిలుపుకోడానికి చేసిన నిష్పల యత్నాలు, ఎడతెగని దాగుడుమూతలాట- తెగేదాకా ఊగిసలాట!. అలాకాదు, ఇలా కాదు, మనమే ఎక్కువ అనేసుకుంటున్నాం అనే ఎడతెగని ఆత్మవంచన. ‘ఇంకేదైనా చెప్పు’, అని మీరంటారని తెలుసు.

 

 అంతటా అదే కదా అంటారనీ తెలుసు. కోట్ల మంది తల్లకిందు లైనా మళ్లీ మళ్లీ అదే అదే. ఎవరికి వారికి అనుభవంలో మాత్రమే కలిగే వేదన. పదే పదే గుర్తుచేసుకోవాలనిపించే జ్ఞాపకాలు, అసలొద్దనుకున్నపుడు మాత్రం మళ్లీ మళ్లీ కెలికి జీవితాన్ని చేదు చేసేది బహుశా ఈ ప్రేమగాయాల్లో మాత్రమేనేమో!‘‘ప్రేమ తిని బతగ్గలగడం నీ కథల్లో మాత్రమే సాధ్యం’’ ప్రసన్న చివరి మాట.. ప్రతి మాటా గుర్తే. అదేంటో కానీ వద్దనుకున్నపుడే ఏమాటా వదిలేయదు మనల్ని. మనసు మాట వినదు కాబట్టి మాటలన్నీ మూటగట్టుకు వచ్చి ఈ సముద్రంలో విసిరేయాలనే వస్తాను పదే పదే.చేతి సంచీ లోంచి నోట్‌ బుక్‌ తీసి రాయడం మొదలు పెట్టాను.‘‘ఇప్పటికీ తాజాగా ఉన్న మొన్నటి స్వప్నాన్ని గుప్పెట్లో దాచుకుని, పురా వైభవాల కోసం వెతుకులాడతాను.’’మసక వెలుతురులో అజ్జాగా రాసుకుంటున్న నన్ను ఆసక్తిగా చూసిందామె.నాదగ్గర ఎప్పుడూ ఎక్కువ డబ్బులు వుండవు. రోటీ మకాన్‌ కపడా కోసం తడుము కునే రోజులు ఏడాదిలో మూడొందల ఏభై. ఎందుకంటే నాకసలు పని చేయడం ఇష్టం వుండదు. కానీ ఈరోజు ఎప్పటిలాంటిది కాదు. నాలుగునెల్ల క్రితం పదానికి రెండురూపాయల చొప్పున చేసిన అనువాదానికి నలభైవేలు రావల్సి వుంటే, మొబైల్‌ అరిగేటన్ని ఫోన్లు చేశాక ఇందాకే ఇరవై వేలు మొహాన కొట్టాడు పాత స్నేహితుడు.