ఆడదంటే అందరికీ లోకువే. మగవాడి అండ, ముఖ్యంగా భర్త అండలేని ఆడదంటే ఇంకా చులకన. ఒంటరిగా బతికే ఆడదంటే, ఈజీగా లొంగదీసుకోవచ్చని ప్రతివాడూ ట్రై చేస్తాడు. పైగా అందమైన పనిమనిషంటే ఈ రాబందుల సంఖ్య మరీ ఎక్కువ. ఈ కథలో సావిత్రి కూడా పనిమనిషే. కానీ ఆమె అలాంటిలాంటి పనిమనిషి కాదు. అల్లాటప్పా పనిమనిషి కాదు. ఆ విషయం ఈ కథలో శ్రీనివాస్‌కి బాగా తెలుసు! ఇంతకీ ఏమిటంటే....
రాజమండ్రిలోని ప్రైవేటు కళాశాలలో రామ్ లెక్చరర్.ఒక ముఖ్యమైన పనిమీద హైదరాబాద్ వచ్చాడు. చిన్ననాటి స్నేహితుడు శ్రీనివాస్ ఇంట్లో బసచేశాడు. శ్రీనివాస్ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్. అతని శ్రీమతి మీనాక్షి కూడా అదే రంగం. వాళ్ళకి ఇద్దరు పిల్లలు. ఒకడు ఐదవ తరగతి. మరొకడు మూడు. బ్యాంకులోన్‌తో మూడు పడకగదుల ఫ్లాట్ కొనుక్కుని, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు శ్రీనివాస్.
రాజమండ్రిలో ఉంటే ఈ పాటికి లేచి తనే ఇంటి పనులన్నీ చెయ్యాలి కాబట్టి పొద్దున్నే లేస్తాడు రామ్. లేవకపోతే భార్య చీల్చి చెండాడేస్తుంది. కానీ తను ఇప్పుడు స్నేహితుడింట్లో అతిథి కాబట్టి కాస్త తీరిగ్గా లేవొచ్చని, దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నాడు పాపం!కానీ రామ్ విధి వక్రించింది. ఉదయం ఐదు కాగానే, పేద్ద మిలిటరీ ఆపరేషనేదో జరుగుతున్నట్లు ఆ ఇంట్లో హడావుడి మొదలైంది. ప్రపంచాన్ని గడగడలాడించే ఐ.యస్ తీవ్రవాదులు నెత్తిమీద గన్ గురిపెట్టి ‘లే’ అని ఆర్డర్ వేసినట్టు గడియారం ఐదు కొట్టగానే అందరూ హడావుడిగా నిద్రలేచారు. ‘‘రేయ్, లేవరా!’’ అని రామ్ భుజంపట్టి ఊపేస్తూ గట్టిగా అరిచాడు శ్రీనివాస్. శ్రీనివాస్ బాదుడుతో నొప్పిపుడుతోన్న భుజంమీద చేత్తో రాసుకుంటూ, ‘‘కాసేపు పడుకోనీరా బాబూ!’’ అన్నాడు రామ్ బద్ధకంగా.‘‘టైమెంతైందో తెలుసా! ఐదు దాటి ఐదు నిమిషాలైపోయింది. లే..లే’’ అంటూ ఈసారి రెండోభుజంమీద మరికాస్త బలంగా గుద్దాడు. ‘‘ఏమిటీ గుద్దుడు? ఏదో షిఫ్టు సిస్టమ్‌లాగా రెండు భుజాలూ వాయించేస్తున్నావేంట్రా బాబూ!’’ అన్నాడు రామ్ దీనంగా. ఏదో మార్నింగ్ ఫ్లైట్ మిస్సై పోతుందన్నట్టు ఎందుకింత తొందర చేస్తున్నారో అర్థం కావడంలేదు రామ్‌కి.