తనకి పెళ్ళిచూపులు జరగలేదు. కళ్యాణమండపంలో తాళి కట్టినప్పుడు చూడ్డమే. తన కూతురికి మాత్రం సంప్రదాయబద్ధంగా పెళ్ళిచూపులు జరిగాయి. ఇప్పుడు మనవరాలి వంతు! తాతయ్య మాట కాదనలేక వచ్చింది. చిట్టిపొట్టి నిక్కరు తొడుక్కుని విమానం దిగి, క్యాబ్‌ చేసుకుని ఒక్కర్తే ఇంటికొచ్చేసింది. అలాంటమ్మాయి తాతయ్య పిలిస్తే పెళ్ళిచూపులకు వచ్చిందా? ఇంతకీ ఆ ‘చిట్టి’ పాప పెళ్ళిచూపుల్లో ఎలాంటి డ్రెస్‌ వేసుకుందట?...

‘‘అమ్మాయ్‌, మన లాస్యని చూసుకోడానికి నరసాపురం సంబంధంవాళ్ళు పై ఆదివారం వస్తామని ఇంతక్రితమే ఫోన్‌ చేశారు. మనం చూసిన ఈ మొదటి సంబంధమే ఎంతో సానుకూలంగా ఉంది తల్లీ. బాపూగారు వారికి బంధువులవుతారంట...’’ఢిల్లీలో ఉంటోన్న మా అమ్మాయి సరస్వతికి ఎంతో ఉద్వేగంతో ఫోన్లో చెబుతుంటే, ‘‘ఏ బాపు..?’’ అంటూ ఆనందపు పానకంలో పుడకవేసింది నా ముద్దుల కూతురు.‘‘అదేం ప్రశ్న అమ్మాయ్‌? బాపుగారు తెలియదూ! అందంగా ఉన్న అమ్మాయిల్ని బాపుబొమ్మలా ఉందంటారే ఆ బొమ్మలబాపుగారు.

కొన్నిసినిమాలకి డైరెక్షన్‌ కూడా చేశారు. వారి స్వగ్రామం నరసాపురమే. మొన్నటి పుష్కరాలకు ముందు గోదావరి స్నానాలరేవులో ఆయన విగ్రహంకూడా ప్రతిష్ఠించారు.‘‘అహా అలాగా! అది సరేగానీ రిజర్వేషన్‌ దొరికినా దొరక్కపోయినా కిందామీదాపడి ఎలాగో అలా మేం హైదరాబాద్‌ వచ్చేస్తాం, కానీ లాస్యని మాత్రం తప్పకుండా రమ్మనిచెప్పు నాన్నా. ఎడ్డెమంటే తెడ్డె మంటుందేమోనని భయంగా ఉంది...’’‘‘ఎలా చెప్పాలో అలా నేను చెబుతానుగా, అల్లుడిగారూ, నువ్వూ ఒకట్రెండురోజులు ముందుగానే వచ్చేయండి. మంచీచెడూ మాట్లాడుకోవచ్చు. ఇచ్చిపుచ్చుకోవటాల గురించీ ఒకమాట అనుకోవచ్చు. లాస్యకి పెళ్ళైపోతే మీ బరువూబాధ్యతా తీరిపోయినట్టే. ఒడ్డున పడిపోయినట్టే’’.వెంటనే లాస్యకి ఫోన్‌ చేశాను. బెంగళూరులో ఏదో కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా ఏడాదినుంచి పనిచేస్తోంది. మా అమ్మాయికి ఇదొక్కతే సంతానం. ఢిల్లీలోనే పుట్టి పెరిగింది.సంగతి చెప్పగానే, ‘‘ఇప్పుడు నాకు పెళ్ళి సంబంధాలు చూడమని నీకు నేను చెప్పేనా?’’ అని ఎదురుప్రశ్న వేసింది.‘‘అదేం మాటే. ఇంట్లో ఎదిగిన ఆడపిల్ల ఉన్నప్పుడు సంబంధాలు చూడొద్దూ? ఎవరూ చూడకుండానే పెళ్ళిళ్ళవుతాయా!’’‘‘ఉద్యోగం వచ్చి ఒక్క ఏడాది కూడా కాలేదు. అప్పుడే పెళ్ళేంటి? కొన్నాళ్ళు ఫ్రీగా ఎంజాయ్‌ చేయనీయండి గ్రాండ్‌ పా’’.