‘‘ఇంచుమించు నూరేళ్ళనాటి ముచ్చట! మా చిన్నప్పుడు మా నాయినమ్మ తరచు చెప్పేదిరా...’’ వీడియో కాల్ లో చెప్పడం మొదలెట్టేడు అరవై ఎనిమిదేళ్ళ తమ్మన్న. విశాఖపట్నంలో విశ్రాంత జీవితాన్ని గడుపుతున్న తమ్మన అమెరికాలోని తన కొడుకు ఫణి మాధవ్‌తో ఏనాటి ముచ్చటలో చెప్పడం, వాటికి కొడుకు, కోడలు తీరిగ్గా ఊఁ కొట్టడం శనివారాల రాత్రుళ్ళు మామూలే!

‘‘....ఇప్పటి సాఫ్ట్ వేర్ చదువుల్లాగా , ఆ రోజుల్లో ఏంటంటే అంకెలూ, అక్షరాలూ నేర్చుకుంటే చాలు, బ్రిటిష్ వాళ్ళ దగ్గర బతికేయొచ్చనుకునేవాళ్ళట. మా బెలగాం వీధుల్లో అయితే గురువులు ఇళ్ళ అరుగులమీద పెద్దబాల శిక్ష చెప్పేవారు. కలిగిన వాళ్ళైతే ‘ప్రైవేటు మాస్టర్ల’ పేరుతో గురువుల్ని ఇళ్ళకి పిలిపించుకునేవారు. వాళ్ళూ, వీళ్ళూ ఇచ్చిన కూరా,నారా, పప్పు, బియ్యం, చీరలు, పంచెల చాపులు, గురుదక్షిణ వగైరాలమీద గురువుల కుటుంబాలు బతికేవట. ‘బతకలేక బడిపంతులు’ అనే సామెతని మా నాయనమ్మ రోజుకి పదిసార్లైనా వల్లించేది. అలాగే బతకడం రొక్కటమైపోయిన అప్పటి రోజుల్లో మా తాత బండారు సూర్యనారాయణ చేసిన ఓ పనికి ఆయనతో ఎలా తగువు పడేదో మాకు చెప్పేది..’’ అన్నాడు తమ్మన్న.

ముత్తాతగారి కాలంనాటి తంటాలూ, తగాదాలూ ఈ తరం కుర్రాడు ఫణి మాధవ్ కి తెలీదా అంటే తెలుసు. అవన్నీ పాతబడిపోయినవే! ఐనా ఆ యువకుడు తొలిసారిగా వింటున్నట్టు వీడియో కాల్‌లో ‘ఊఁ’ కొట్టాడు. అలా ఎందుకని ఎవరైనా అడిగితే-, ‘‘ఇష్టమైన కూర మాటిమాటికీ వండుకు తినటం లేదూ? ఇదీ అలాంటిదే! ఐనా వెనకటి తరం పడ్డ కష్టాల్ని ఇలా పంచుకుంటేనే ఈ తరానికి గుర్తుంటాయి. కృతజ్ఞత అంటే ఏమిటో తెలుస్తుంది’’ అంటాడు తమ్మన్న.