రాత్రి ముదిరిపోయింది. సినిమా మొదటి ఆట విడిచి అరగంటైంది. రోడ్లపై జనం పలచబడ్డారు. ఊరు బయట కొత్త బస్టాండ్‌వైపు అప్పుడొకరు ఇప్పుడొకరు అన్నట్లు మనుషులు కదులుతున్నారు. సిమెంటు రేకుల షెడ్డు మధ్యలో వేలాడుతున్న కరెంటు బల్బు బస్టాండు మొత్తానికి వెలుగులు అందించలేక నీరస పడుతోంది.హైదరాబాద్‌వెళ్ళే చివరిబస్సు తొమ్మిదింటికే రావలసింది. ఏనుగులా భారంగా కదులుతూ అరగంట ఆలస్యంగా వచ్చి ఆగింది. కండక్టర్ డోర్ తీయగానే బసెక్కినవాళ్ళంతా కోరుకున్న సీట్లలో కూచొని హమ్మయ్య అనుకున్నారు.
కండక్టర్ టికెట్లు ఇవ్వడం మొదలుపెట్టాడు. ‘‘హైద్రాబాద్‌కు ఎంత?’’ అడిగారెవరో. ‘‘ముప్పయి రూపాయలు’’ తల ఎత్తకుండానేచెప్పి ఏదో జ్ఞాపకం వచ్చినట్టు, ‘‘చిల్లర ఇవ్వండి. యాభైనోటైనా పర్వాలేదు, వందలిస్తేనే కష్టం’’ అని మాట ముగించి మళ్ళీ పనిలో పడ్డాడు కండక్టర్. ‘‘హైదరాబాద్‌కు ఎప్పుడు చేరుకుంటుంది?’’ మరో ప్రశ్న. ‘‘పొద్దున ఐదింటికి గౌలిగూడ బస్ స్టేషన్‌లో ఉండాలి. టికెట్... టికెట్’’అంటూ ముందుకెళ్ళాడు.మెల్లగా బస్‌స్టాండ్‌లోంచి బయటకొచ్చిన బస్సు మెయిన్‌రోడ్డు ఎక్కడంతో కొంతవేగం అందుకుంది. సింగిల్‌లైన్ తారురోడ్డు కావడంవల్ల ముందు వచ్చే వాహనాలకు సైడిస్తూ రోడ్డెక్కుతూ బస్సు కరీంనగర్ చేరేసరికి పన్నెండైంది.బస్టాండు బయట ఆగిన అంబాసిడర్ కారు డ్రైవర్ బస్సువైపే చూస్తున్నాడు.
బస్సులోంచి దిగిన నలుగురూ కారువైపు రావడంచూసి నమస్తే అంటూ డోర్లు తెరిచాడు. నలుగురు సర్దుకుని కూర్చున్నాక కారు వరంగల్‌వైపు కదిలింది. తెల్లవారే దాకా ప్రయాణమే అని తెలిసిన ఆ నలుగురూ ముచ్చట్లలో పడ్డారు.‘‘ఏం మాట్లాడుతలేవు పెద్దన్నా’’ అన్నాడు మారుతిరావు డ్రైవర్ ప్రక్కన కూచున్న శంకరయ్యను ఉద్దేశించి.‘‘అరె! ఏం మాట్లాడుమంటవే! దుకాణంనిండా బట్టలుండగ మళ్ళీ ఖరీదుకెందుకు అని మా ఆడది ఒకటే రపరప. దానికేదో అనుమానం వచ్చినట్లుంది’’ దిగాలుగా చెప్పాడు శంకరయ్య.