అరవైఏళ్ళ క్రితం...బెలగాం అగురు వీధిలోని వెంకటరమణమూర్తి కోవెలలో పల్లకిసేవ అంటే అదో వేడుక! ఉభయనాంచారులతో కలసి శ్రీనివాసపెరుమాళ్ళు ఊరేగిరావడం మనకు ఓ అందమైన జ్ఞాపకం! ఏకాదశి పర్వదినాల్లో చీకటి చిక్కబడగానే, కాగడా వెలుగులు తడి ఆరిన సీతాకోకచిలుక రెక్కల్లాగా రెపరెపలాడేవి. డోలు,సన్నాయిల నడుమ కంచు పిడిగంట కర్ణపుటాల్ని గిలిగింతలు పెట్టేది. కర్పూరం, అగరొత్తులూ కలగలిసిన గమ్మత్తైన పరిమళం గుప్పుమంటూ గాల్లో గిరికీలు కొడుతుంటే, బెలగాం వీథుల్లో స్వామిపల్లకి పరమాత్మను పొదుగుకున్న జీవాత్మలా ఊరేగేది!
అర్చకులు కొండూరి అప్పలనరసింహాచార్యులు విష్ణుసహస్రనామాలు చదువుతూ పల్లకికి ఓ పక్కగా నడిచేవారు. ఒక చేతిలో కాగడా, మరోచేతిలో చమురు సీసాతో అప్పన్న నాలుగడుగుల ముందుండేవాడు. ఉండీ ఉడిగీ సీసాని వంచుతూ, కాగడానెత్తిన చమురు చుక్కలు పోస్తూ, చల్లారే వెలుగుల్ని ఎగదోసేవాడు. అప్పన్నకి మరో నాలుగడుగులు ముందు డోలు సత్తి, సన్నాయి సుబ్బడు నడిచే వాళ్ళు.అల్లంత దూరంలో సన్నాయిమేళం వినగానే, ‘‘దేవుడొస్తున్నాడు..’’ అంటూ వీధుల్లోవాళ్ళు త్వరపడేవారు.
అప్పటికప్పుడు పళ్ళెంలో బియ్యంపోసి, హారతి కర్పూరం, ఊదొత్తులు పెట్టుకుని గుమ్మాలు దిగివచ్చేవారు. వారికోసం పల్లకి ఆగినప్పుడల్లా ముందు, వెనక కొమ్ములు కాస్తున్న రాముడు, రంబుడు పల్లకి బరువును భుజాలమీద నుంచి దించి, ఊత కర్రల మీద నిలబెట్టే వాళ్ళు. పళ్ళాలను అందుకున్న అప్పల నరసింహాచార్యులు ఉత్సవమూర్తులకు హారతినిచ్చి, భక్తుల తలలపై శఠగోపం ఉంచి, ప్రసాదంతో పాటు పళ్లాలను తిరిగి అందజేసేవారు. పల్లకి ముందుకు కదిలేది. ఈ పల్లకీసేవ మొత్తానికి ప్రత్యేక ఆకర్షణ బట్టల సూర్యనారాయణ!ఊరేగింపు ముందుభాగంలో సూర్యనారాయణ ఉండాల్సిందే! కంచుతాళాలు వాయిస్తూ, గొంతెత్తి పాడుతూ, గుమ్మాలముందు నిలబడి, ‘‘దేవుడొస్తున్నాడు. దర్శనం చేసుకోండమ్మా..’’ అంటూ జనాన్ని పెద్దగా పిలిచేవాడు.