‘నియోజక వర్గం ఏమిటి? ఒక్కడు దేశాన్ని భయపెట్టగలడు. ప్రపంచాన్ని భయపెట్టగలడు హిట్లర్ లాగా. అందుకే క్రూరంగా హిట్లర్ చనిపోయాడు. అందువల్లే యం.పి.ని హత్య చేశాను. హిట్లర్ చచ్చిపోతే ప్రపంచ శాంతి సుస్థిరమయింది. యం.పి. చనిపోతే నియోజకవర్గం నిశ్చింతగా ఉంది.’
‘యం.పి.ని హత్య చేసింది నేనే’ అంటూ యువకుడు కోర్టు హాలులోకి ప్రవేశించాడు. పాతికేళ్ళు ఉండవచ్చు. బిచ్చగాడిలా ఉన్నాడు. న్యాయమూర్తి అతణ్ణి పిచ్చివాడనే భావిస్తున్నట్లు అతడి వాలకం ఉంది. ఎవరన్నా అయితే వాణ్ణి అవతలికి పంపించండి అనేవాళ్ళు. న్యాయమూర్తి కాబట్టి, మంత్రసానిలాగా బిడ్డవచ్చినా, గడ్డ వచ్చినా పట్టుకోవాలి కాబట్టి అసహనాన్ని అణిచిపెట్టుకొన్నాడు.న్యాయమూర్తి కేసు పూర్వాపరాలన్నీ విన్నాడు. న్యాయవాదుల వాదోపవాదాలు గ్రహించాడు. పోలీసుశాఖ సమాచారం పరిశీలించాడు. ప్రత్యేక పరిశోధక బృందం అందించిన వాస్తవాలు పరీక్షించాడు. ఆరోజు తీర్పు చెప్పబోతున్నాడు.
యం.పి. హత్య కేసులో హంతకుడు పట్టుబడలేదు. హంతకుడు ఎవరో ఎవరికీ తెలియలేదు. హంతకుడు హత్య చేయటానికి కారణాలు తెలియలేదు. హత్య చేసిన పిస్టల్ దొరకలేదు. సాక్ష్యాలు లేవు. పిచ్చివాడి చేష్టగా లేదు. ఏదో హంతక ముఠా ప్రణాళిక ప్రకారం చంపినట్లుగా లేదు. హత్య అర్థం కాలేదు.యం.పి. హత్య నడిబజారులో జరిగింది. బాడీ గార్డ్సు ఆరుగురు చుట్టూ ఉన్నారు. వందలాది జనం వీధిలో ఉన్నారు, అది బిజీ సెంటరు. యం.పి. ప్రజల యోగక్షేమాలు విచారిస్తున్న సమయం. ఒకే బుల్లెట్, శబ్దం లేకుండా గుండెలో దూరింది. చంపిన వాణ్ణి ఎవరూ చూడలేదు. మేం చూడలేదని అందరూ చెప్పారు.
బాడీ గార్డ్సుతో సహా. న్యాయమూర్తి కేసు కొట్టేయటానికి సిద్ధపడ్డాడు. యువకుడి రాకతో తీర్పు చదవకుండా ఆగిపోయాడు. కేసు పునర్విచారం చేయటానికి సిద్ధపడ్డాడు.యువకుడి పేరు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ పేరు తల్లి పెట్టింది. జైల్‌లో పుట్డాడు. తల్లి అసహజంగా జైలులోనే చనిపోయింది. అతడికి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు లేరు. అతను తండ్రిని చూడలేదు. తల్లి గర్భంలో తాను పడ్డప్పుడే తండ్రి బాంబు పేలుడులో చనిపోయాడు. తల్లి అతడికేమీ చెప్పలేదు. పసిగుడ్డు. తల్లీ తండ్రి తెలియదు. బంధువులం అన్నవాళ్ళు లేరు. ఉండి ఉంటారు. ముందుకు రాలేదు. పిల్లవాణ్ణి తీసుకుపోలేదు. పెంచలేదు.