ఈ రోజు రాత్రే వాళ్ళు దేశం పోయేది. ఇది కొత్త బాచ్చి. కొబ్బిరికారం గొడ్డుకారంతో పాటు ఉన్న గుడ్డల్ని ఒద్దిగ్గా ట్రంకుపెట్టిల్లో సర్దుతున్నారు అమ్మలు.మంచాలమీద కాళ్ళు ఏలాడేసి కూర్చొని, ఎక్కడన్నా ‘డుర్రు’ మంటే చాలు ఉలిక్కిపడతా, ‘‘మోయ్‌ బస్సొచ్చినట్టుంది.. వాడు రడ య్యాడా?’’ అంటా కేకలు ఏస్తున్నారు నాన్నలు.‘‘ఏంది ఈ రోజు ప్రార్థనకి జనాలు ఎక్కువ మంది రాలేదు?’’ అంటా పాడే పాటని ఒక్క క్షణం ఆపి అడిగేడు ఏద్దాసుని పాస్టరుచర్చీలో.‘‘చాలామంది కుర్రోళ్లు బేల్దారి పనికోసం దేశం పోతుంట్రే, ఈ రోజు ఇంతకంటే ఎక్కువ మంది రారు, ఇక ఈల్లే’’ అన్నాడు ఏద్దాసు ఒక చందాల సంచిని లోపల పెడుతూ.‘‘అయితే కళ్ళు మూసుకోండి ప్రార్థనచేద్దాం’’ అంటా వాఖ్యం చెప్పబోయేముందూ చేసే ప్రార్థన చేస్తున్నాడు చర్చీలో ఇసాకు పాస్టర్‌.బస్సెక్కడానికి రెడీ అయిన కుర్రోళ్లు, వాళ్ళ కుటుంబాలు, చర్చీకాడికొచ్చి లోపలికి చూస్తా, రెండు చేతులెత్తి దండం పెట్టారు. ప్రార్థన అయిపోయి కళ్ళు తెరిచిన పాస్టర్‌ వాళ్ళని చూసి నవ్వుతా వాఖ్యం చెప్పడం మొదలు పెట్టాడు.‘‘అబ్బాయ్‌ ఇంకో అరగంటలో బస్సు వచ్చిద్దంట’’ అక్కడికి అప్పుడే చేరుకున్న మనుషులకి వినపడేలాగా అరిచాడు ఏలియ మేస్త్రీ ఫోన్‌ కట్జేస్తా.చాలా మటుకు అందరూ అక్కడికి చేరుకున్నారు. ఒకర్ని చూసి ఒకరు నవ్వుకుంటున్నారు, మాట్లాడుకుంటున్నారు, మంతనాలు చేస్తున్నారు.‘‘పాన్‌ పరాగులు గీను పరాగులు తింటం మాత్రం నేర్చుకోబాకయ్యా నీకు పున్నిముండిద్ది’’ అంది తల్లో చెయ్యిపెట్టి లేని పేలు వెతుకుతా ఒక నాయనమ్మ.‘‘ఏలకి కూడు తిను.. కంటి నిండా నిద్రపో’’ చుట్ట చుడతా చెబుతున్నాడు ఇంకో తాత.‘‘మేస్త్రీ దగ్గర ఆడ్మాన్సు డబ్బులు కూడా తీసుకున్నామయ్యా, పని ఎగనూకి రాబాక, కష్టమో నిష్టమో నువ్వు పని చేస్తేనే మనకి కూడు’’ కళ్ళు తుడుచుకుంటా ఒక తండ్రి.‘‘మీ నాన్న తాగి తాగి సచ్చేడు, నువ్వు ఆ తాగుడు మాత్రం అలవాటు చేసుకోబాక, అక్కాయ్కి పెళ్లి చెయ్యాలి గుర్తుబెట్టుకో’’ సెల్లుఫోన్లో మునిగిన కొడుకుకి దీనంగా చెప్తంది ఒక తల్లి.‘‘అబ్బాయ్‌ ఏలియో పిల్లోడు జాగ్రత్తయ్య, ఇక ఏదైనా పిల్లోడికి నువ్వే’’ పెద్దగా మేస్త్రీతో చెప్పింది ఒక అమ్మమ్మ.

                                            *********************************************************