అపకారికి కూడా ఉపకారం చెయ్యమన్నారు పెద్దలు. మనవల్ల ఉపకారం పొందేవారు అర్హులై ఉండాలనే కోరుకుంటారు అందరూ. కానీ స్వార్థపరులని తెలిసిన తర్వాత కూడా వారికి ఉపకారం చెయ్యాలనీ, వారికోసం ప్రాణాలు కూడా త్యాగం చెయ్యాలనీ కోరుకుంది ఈ కథలో ఒక ఇల్లాలు. కుటుంబంలో అందరికీ ఎలా మెలగాలో చెప్పిన ఆ ఇల్లాలు కోడలుపట్ల మాత్రం స్వార్థబుద్ధితో వ్యవ‌హరించింది. అలాంటి ఇల్లాలి త్యాగానికి విలువ ఉంటుందా? ఆమె మహాపుణ్యాత్మురాలు అనిపించుకోగలదా?

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజానవేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, పరోపకారం చేసేవారు నిస్వార్థపరులే కావచ్చు. కానీ ఉపకారం పొందేవారిలో మాత్రం ఎక్కువమంది స్వార్థపరులై ఉంటారు. అది గ్రహించని కొందరు ఉపకార గుణంతో స్వార్థపరులకు సహాయం చేసి, నిస్వార్థపరులకు మనస్తాపం కలిగిస్తుంటారు. నీ విషయం నాకు తెలియదు కానీ ఒకప్పుడు భారతి అనే ఉత్తమ ఇల్లాలు అలాగే చేసింది. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

పురాణపురంలో విద్యానాథుడనే పండితుండేవాడు. ఆయన భార్య భారతికి పుణ్యాత్మురాలని పేరు. ఆ దంపతులకు భార్గవుడు, శుక్రుడు అని ఇద్దరు కొడుకులూ, సుచిత్ర అనే కుమార్తె కలిగారు. సుచిత్రకు వివాహమై కాపురానికి వెళ్లి భర్తతో హాయిగా ఉంది. కొడుకుల్లో పెద్దవాడు భార్గవుడు పాండిత్యంలో తండ్రి అంతటివాడని పేరు తెచ్చుకున్నాడు. అతడి భార్య రేవతి, భర్తకి అనుకూలంగా ఉంటూ, ఇంట్లో అందరికీ తలలో నాలుకగా ఉంటోంది. ఆ దంపతులకు సమీరుడు ఒక్కగానొక్క కొడుకు. మనుమడంటే భారతికి ప్రాణం. చిన్నవాడు శుక్రుడికి కూడా పాండిత్యంలో ప్రతిభావంతుడని పేరొచ్చింది. ఆ ఊరు జమీందారు వాడిని తన ఆస్థానపండితుల్లో ఒకడిగా చేరమని కోరాడు. కానీ తను నేర్చుకోవాల్సినది ఇంకా చాలా ఉన్నదన్న భావనతో శుక్రుడు తటపటాయిస్తున్నాడు.

ఇలాంటి వచ్చని నంసారంలో ఉన్నట్టుండి వరుసగా చిక్కు సమస్యలు మొదలయ్యాయి.పట్నంలో గురుకులం నడుపుతున్న జ్ఞానానందుడు, తనకు వయసైపోయిందని గురుకులాధివతి పదవినుంచి తప్పుకోవాలనుకున్నాడు. ఆ పదవికి భార్గవుడే తగినవాడని భావించి గురుకులానికి రావలసిందిగా భార్గవుడికి కబురంపాడు. భార్గవుడికి ఆ గురుకులానికి అధిపతి కావడం ఇష్టమే. ఎందుకంటే అక్కడున్న ఉద్దండపండితుల సాహచర్యంలో తన శాస్త్రజ్ఞానం మరింతగా వికసిస్తుంది. ఆ గురుకులంలో శిష్యులుగా చేరేవారు కూడా సామాన్యులుకారు. తమ సందేహాలతో గురువు ప్రతిభనే సవాలుచెయ్యగల సమర్థులు. అక్కడ విద్య నేర్చుకున్నా, నేర్పినా జ్ఞానవృద్ధి కలుగుతుందని చెప్పుకుంటారు.