వాళ్ళిద్దరూ ఇరుగు పొరుగు కోడళ్ళు. వారిలో రంగమ్మను మెట్టినింట్లో కూతురులా చూసుకుంటారు. ఒకసారి ఈ అత్తాకోడళ్ళ మధ్య సవాలు వచ్చింది. పొరుగింటి సూరమ్మను, ఆమె కోడలిని ఒకటి చేయాలనేదే ఆ సవాలు. రంగమ్మ ఆ కోడలు కామాక్షిని పిలిచి అత్తవారింట్లో తను చెప్పినట్టు నడుచుకోమని ఒక ఉపాయం చెప్పింది. సరేనంది కామాక్షి. కానీ ఎంతకాలమైనా కామాక్షి తీరు మారలేదు. కామాక్షి మాత్రం నువ్వు చెప్పినట్టే చేస్తున్నానని ఢంకా బజాయించి చెబుతున్నది. మరి తప్పు జరిగిందెక్కడ?

************************

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, నువ్విక్కడికి ఇష్టంగా వచ్చావో, అయిష్టంగా వచ్చావో నాకు తెలియదు. ఇష్టమైనా, కాకున్నా లక్ష్యసాధనే ముఖ్యమనుకునే కామాక్షివంటివారు కొందరుంటారు. నీ మనసులో ఏముందో తెలియదు. కానీ, శ్రమ తెలియకుండా నీకా కామాక్షి కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.కొత్తగా పెళ్ళైన రంగమ్మకి అత్తింటికి వచ్చి రెండేళ్ళైనా కూడా మహాసుఖంగా రోజులు గడిచిపోతున్నాయి.ఎందుకంటే అత్తమామలు ఆమెను కూతురులా చూసుకుంటారు. భర్త కృష్ణుడు ఆమె గీచిన గీత దాటడు. ఆ ఇంటి పాలేళ్లు కూడా ఆమె ఊఁ అన్నాకనే యజమాని ఆదేశాలు పాటిస్తారు.‘‘నేను చాలా తెలివైనదాన్ని. మంచి వ్యవహారదక్షత ఉన్నదాన్ని.

అందుకే ఇక్కడ అన్ని విషయాల్లోనూ నా మాటే చెల్లుతోంది’’ అని రంగమ్మ భర్త దగ్గర గర్వపడింది. కృష్ణుడు ఈ విషయం తల్లి వీరమ్మకి చెప్పాడు.వీరమ్మ ఓ రోజు కోడల్ని పిలిచి, ‘‘ఇక్కడ అన్నీ నువ్వు చెప్పిన ప్రకారం జరుగుతున్నాయంటే, అదంతా నీ ప్రతాపమని మిడిసిపడకు కోడలా! మా ఆందరికీ నువ్వంటే ఇష్టం. అందుకే నీకిలాసాగుతోంది’’ అని మందలించింది.రంగమ్మ అంత సులువుగా ఒప్పుకుంటుందా, ‘‘మీ అందరికీ నేనంటే ఇష్టమెలా పుట్టింది- నా తెలివితేటలవల్లనే కదా!’‘ అంది వెంటనే.రంగమ్మ అత్తగారు వీరమ్మ తల అడ్డంగా ఊపి, ‘‘నీ తెలివితో మాకేం పని? నువ్వు మంచిదానివి. మేమూ మంచివాళ్లం. నువ్వంటే మేము ఇష్టపడ్డానికి ఇదొక్కటే కారణం. అంతేతప్ప ఇష్టాఇష్టాలు తెలివివల్ల పుట్టవు. నా మాటమీద నమ్మకం లేకపోతే, నీ స్నేహితురాలు కామాక్షికి దాని అత్త సూరమ్మమీద ఇష్టం పుట్టించి నీ వ్యవహారదక్షత నిరూపించుకో’’ అంది.