ఏదైనా మంచిపనిచేస్తే మనకు పుణ్యం దక్కుతుంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. తద్వారా మంచి ఆరోగ్యం కూడా లభిస్తుంది. ఆ దేశపు రాజుని ఏదో లొంగని రోగం పట్టిపీడిస్తుంటే, ఒక బైరాగి వచ్చి ఆ రాజుకు ఒక మంత్రం ఉపదేశించి, రోజుకోమంచి పని చెయ్యమన్నాడు. బైరాగి చెప్పినట్టు చెయ్యగానే రాజు ఆరోగ్యం మెరుగుపడింది. కొంతకాలానికి అతడు మళ్ళీ మంచానపడ్డాడు. ఈ సారి అదే మంచిపని చేసినాగానీ రాజు ఆరోగ్యం మెరుగుపడలేదు. మంత్రం పనిచేయలేదు. ఎందుకని?..

***************

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, పరోపకారం చేసేవారిలో నిస్వార్థపరులే కాదు, స్వార్థపరులూ ఉంటారు. నీవు కనుక స్వార్థంతో ఇక్కడికొచ్చి ఉంటే, మంచితనం కూడా నీకు అచ్చిరాకపోవచ్చునని తెలుసుకో. వెనుకటికి మాధవయ్య అనేవాడి విషయంలో అలాగే జరిగింది. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.చింతలదేశపు రాజు చిత్రసేనుడు శాంతికాముకుడు. ఏటా ఓ పర్వదినాన ఆయన నూరు పావురాల్ని గాల్లోకి వదిలి స్వేచ్ఛని ప్రసాదిస్తుంటాడు. ఉన్నట్లుండి ఆయనకి ఏదో వింత జబ్బు చేసింది. దాంతో ఆయన మంచందిగి నడువలేని పరిస్థితి ఏర్పడింది. రాజవైద్యులేకాక, దేశంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చి చూసిన ప్రముఖవైద్యులు ఎవరికీ కూడా ఆయన జబ్బేమిటో అంతుపట్టలేదు.

ఒకరోజు ఒక బైరాగి రాజదర్శనం చేసుకుని, ‘‘రాజా! నీకొచ్చిన విచిత్రవ్యాధిని తగ్గించగల అపూర్వమంత్రం నాకు తెలుసు. అది పనిచెయ్యాలంటే నీవు ముందుగా ఓ మంచిపని చెయ్యాలి’’ అన్నాడు. మామూలుగా ఐతే రాజు ఆ మాటలు పట్టించుకునేవాడుకాదు. కానీ ఇప్పుడెలాగూ వేరే దారి లేకపోవడంతో, ‘‘మంచిపని అంటే ఏంచెయ్యాలో సెలవియ్యండి, చేతనైతే చేస్తాను’’ అన్నాడు.‘‘నీవద్దకొస్తున్నప్పుడు నీ కోటలోని పంజరాల్లో బందీలుగా ఉన్న నూరుపావురాల్ని చూశాను. వాటికి స్వేచ్ఛప్రసాదించు’’ అన్నాడు బైరాగి. రాజు సరేనని భటులకు తగిన ఆదేశాలు ఇచ్చాడు. తర్వాత బైరాగి, ‘‘ఆ చిన్నిప్రాణులకు లభించినస్వేచ్ఛ నీకు మంచంనుంచి స్వేచ్చను ప్రసాదిస్తుంది’’ అని కళ్ళు మూసుకుని మంత్రోచ్చారణ చేస్తున్నట్లు పెదాలు కదిపాడు.