అమర దేశానికి మహానలుడు రాజు. తెలివి దేశానికి రక్షకుడు, మార్గదర్శి మహానందుడు. వీరిద్దరి ఆలోచనల్లో ఎంతో తేడా. ఒకరు ఆధిపత్యానికీ, చెడుకీ ప్రతినిధి అయితే, మరొకరు ఐక్యతకూ, అస్థిత్వానికీ, స్వేచ్చకీ ప్రతినిధి. ఒకరు భాషను ఆయుధంగా చేసుకుని ప్రపంచాధిపత్యం సాధించాలని చూస్తే, మరొకరు నాయకుడి అవసరమే లేకుండా సుఖవంతమైన జీవితం గడిపే దేశాన్ని రక్షించే ప్రతినిధి. వీరిద్దరికీ మధ్య జరిగిన పోటీలో ఎవరు గెలిచారు? ఓడినవాడు నిజంగా ఓడినట్టేనా?
********************************
పట్టు వదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజానవేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, మనిషిని పశువులకంటే గొప్పవాణ్ణి చేసింది భాష. ఆ భాషను పక్కనపెట్టి మౌనంగా ఉండడం నీవంటి తెలివైన మనుషులకు తగదని నేనంటాను. ఒకవేళ మాతృభాష నీకు నచ్చకపోతే, నేర్చుకుని మాట్లాడ్డానికి ఈ ప్రపంచంలో ఎన్ని భాషలు లేవు? అప్పుడు నీతో మాట్లాడ్డానికి ఎవరూ దొరకరని భయం వలదు. రాజువి కాబట్టి, నీ దేశంలో ప్రజలందర్నీ నీకు నచ్చిన భాష నేర్చుకోమని శాసించే అధికారం నీకుంది. ఒకప్పుడు సుకుమారుడు అనే నాయకుడు అదే పని చేశాడు. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.అమర దేశానికి మహానలుడు కొత్తగా రాజయ్యాడు.
అక్కడి పౌరులు వ్యవసాయంలో నిపుణులు. ఆయుధాల తయారీలో అగ్రగణ్యులు. సర్వరోగాలకూ మందులు కనుగొన్న అఖండులు. నిత్య జీవితంలో క్లిష్టమైన పనుల్ని సుసాధ్యం చేసే పరికరాల్ని రూపొందించడానికి విజ్ఞానశాస్త్రాన్ని మథించిన అసాధ్యులు. ఐనా మహానలుడు తృప్తి పడలేదు. తనదేశం ప్రపంచంలో అన్నిదేశాలకంటే సుసంపన్నం, శక్తిమంతం కావాలని ఆయన కోరిక. అందుకని ముందుగా తనదేశంలో తయారయ్యే మందులగురించి విదేశాల్లో బాగా ప్రచారంచేసి అమ్మించాడు. రోగాల్ని ఇట్టే తగ్గించే ఆ మందులకు తొందరలోనే ప్రపంచమంతా గిరాకీహెచ్చి, అమర దేశపు ఆదాయం బాగా పెరిగింది. దాంతో అంతవరకూ ఉన్న ఉత్పత్తులు సరిపోక వాటి తయారీకి కొత్త కర్మాగారాలు నిర్మించాల్సి వచ్చింది. వాటిలో పనిచెయ్యడానికి అమరదేశపు పౌరులు చాలక, విదేశీ పౌరుల్ని రప్పించి శిక్షణ ఇవ్వాల్సివచ్చింది.