మనలో పాపం చెయ్యనివాడు ఎవడూ ఉండడు. కానీ ప్రతివాడికీ పాపభీతి ఉంటుంది. ఆ పాపాలు కడిగేసుకోవాలనీ, పుణ్యాత్ముల్లా మారిపోవాలనీ అందరూ కోరుకుంటారు. పాత పాపాలు కడిగేసుకుంటే మళ్ళీ కొత్త పాపాలు చెయ్యడానికి ఎవరూ వెనుకాడరు. అందుకు దైవభక్తిని అడ్డంపెట్టుకుంటారు. కానీ ఆ ఊళ్ళో మాత్రం అందరూ తమ తమ పాపాలూ కడిగేసుకోవడానికి ఒక మహానుభావుడు అవతరించాడు. పాపాలన్నీ అతడే తీసుకునేవాడు. చివరకు ఏమైందంటే....
పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్నిదించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, ఎవరికో సాయపడాలని నిస్వార్థంగా మౌనదీక్ష పట్టావు. ఐనా పాటించడానికి శ్రమపడుతున్నావు. దీక్షలు పట్టడంలో ఎంతోకొంత స్వార్థం ఉంటే, వాటిని పాటించడం సులభం అవుతుందేమోనని సుమంతుడి కథ చెబుతుంది. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.
ఒకానొకప్పుడు చంద్రావురంలో సుమంతుడనే బ్రాహ్మణకుమారుడు ఉండేవాడు. వాడికి చదువుసంధ్యలు అబ్బలేదు. అయినా బ్రాహ్మణుడని ఊరివాళ్లు వాణ్ణి ఎంతోకొంత గౌరవించేవారు. కానీ విద్వత్ సభలకుగానీ, పౌరోహిత్యానికిగానీ వాడిని ఎవరూ పిలిచేవారుకాదు.సుమంతుడికి ఇరవైయేళ్ళు వచ్చాయి. అప్పటికి వాడి అన్నలే కాదు, తమ్ముళ్లు కూడా విద్యాధికులై ఎవరిపొట్టవారు పోసుకుంటున్నారు. ఏ సంపాదనాలేని నుమంతుడికి ఇంట్లో గౌరవం ఉండేది కాదు. తను చాలా గొప్పవాడిని అనిపించుకోవాలని సుమంతుడికి కోరిక. ఏ విషయంలోనూ స్థిరత్వంలేక వాడు ఏదీ సాధించలేకపోయాడు.ఒకరోజున చంద్రాపురానికి బైరాగి ఒకడు వచ్చాడు. ప్రజలకు హితోపదేశంచేస్తూ, ‘‘మనిషి శరీరానికి ఆయువు నూరేళ్లే. కానీ, ఆత్మ కోట్లసంవత్సరాలు బ్రతుకుతుంది. నూరేళ్ల సుఖంకోసం మనిషి తప్పుచేస్తే, అందుకు ఫలితంగా ఆ మనిషి ఆత్మ కోట్లసంవత్పరాలు నరకంలో యాతనపడాలి. కాబట్టి తప్పులు చేయకండి’’ అన్నాడు.
ఇది విని అక్కడున్నవాళ్లలో చాలామంది కంగారుపడి, ‘‘స్వామీ! ఇప్పటికే మేము ఎన్నో పాపాలు చేసి ఉంటాం. వాటికి విముక్తిమార్గం చెప్పండి! ఇక ముందు పాపాలు చేయకుండా జాగ్రత్తపడతాం’’ అని వేడుకున్నారు.బైరాగి మందహాసం చేసి, ‘‘చేసిన పాపాలు తొలగిపోవాలంటే వుణ్యదీక్ష పట్టాలి. ఆ దీక్ష చాలా కష్టమైనది. రోజూ తెల్లవారుఝామునే లేచి ఎముకలుకొరికే చలిలో చన్నీళ్లస్నానం చేయాలి. తర్వాత నేను ఉపదేశించిన మంత్రాన్ని ముమ్మారు జపించాలి. రోజుకి ఒకపూట మాత్రమే ఆహారం తీనుకోవాలి. అది కూడా మితంగా ఉండాలి. చిరిగిన బట్టలు వేసుకుని, కాళ్లకు జోళ్లు లేకుండా కాలినడకన చుట్టుపక్కల ఊళ్లలో తిరిగి రావాలి. కటికనేలమీద పడుకోవాలి. వణికించే చలివేసినా భరించాలేతప్ప దువ్పటి కప్పుకోకూడదు. ప్రాణంమీదకు వచ్చినా జీవహింస చేయకూడదు. తెలిసి తెలిసి ఈగ, దోమ లాంటి అల్పప్రాణుల్ని కూడా చంపకూడదు. ఎవరేమన్నా కోవం తెచ్చుకోకూడదు. అబద్ధం చెప్పకూడదు. ఇలా ఆరుమాసాలు వుణ్యదీక్ష చేస్తే అంతవరకూ చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయి’’ అని చెప్పాడు.