పొట్టచేతపట్టుకుని పొరుగూరు వెళ్ళాడతను. అన్నయ్యవరసైనవాణ్ణి ఆసరాగా చేసుకుని పనులు సంపాదించుకుంటూ పబ్బం గడుపుకుంటున్నాడు. అతడివల్ల ఆ అన్నయ్య పరువు ప్రతిష్టలు ఇనుమడించడమేకాదు, సీనయ్య అందరికీ తలలో నాలుకలా ఉండేవాడు. ఒకనాడు బావినీరు విషపూరితమైతే మంత్రం పఠించి శుద్ధిచేశాడు. అలా ఎన్నో మంచి పనులు చేశాడు. సీనయ్య మంత్రబలంవల్ల చాలామంది లాభం పొందారు. కానీ ఒకసారి ఏమైందంటే....

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, నిన్నిక్కడికి రప్పించిన సిద్ధుడు నీకేదైనా మంత్రోపదేశంచేసి మానవాతీతశక్తులు ప్రసాదిస్తాడని అనుకుంటున్నావేమో! కానీ నువ్వు తెలివైనవాడివి. తెలివైనవాళ్లకి మంత్రాలు వేరెవరో ఉపదేశించనవసరం లేదని గ్రహించలేవా? ఒకవేళ నీకు నువ్వే కల్పించుకున్న మంత్రంవల్ల ప్రయోజనం ఉండదనుకుంటున్నావేమో! కానీ సామాన్యుడైన సీనయ్యే అలా ప్రయోజనం పొందాడు.

శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను. విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.సీనయ్య పేదవాడు. బ్రతుకుతెరువు కోనం పల్లె విడచి పట్నం చేరాడు. అక్కడ కనకయ్య అనే దూరపు బంధువుని కలుసుకున్నాడు. కనకయ్య భాగ్యవంతుడు. వరుసకు సీనయ్యకు పెద్దన్నయ్య ఔతాడు. కానీ ఆయన ఆ బంధుత్వాన్ని పట్టించుకోకుండా, ‘‘ఏమీ అనుకోకు. నా ఇంట్లో నీకు ఆశ్రయమివ్వడం జరుగని పని’’ అని ఖచ్చితంగా చెప్పేశాడు.అప్పుడు సీనయ్య, ‘‘పెద్దన్నయ్యా! నేను ఆశ్రయంకోసం రాలేదు. నేను నిన్ను డబ్బు అడగను. తిండిపెట్టమని అడగను. నేను ఇక్కడికి పనికోసం వచ్చాను. కానీ ఊరూపేరూ లేనివాడికి పని ఎవరిస్తారు? కాబట్టి నన్ను నీ తమ్ముడని చెప్పుకోనివ్వు. నీ పేరు చెప్పుకుని నాలుగిళ్లలో చాకిరీకి కుదిరి పొట్టపోషించుకుంటాను.

నీ పేరుచెప్పి ఎక్కడా రాగిపైస కూడా అప్పు చెయ్యను’’ అని హామీ ఇచ్చాడు. కాదనడానికి ఏమీ లేకపోవడంతో, అయిష్టంగానే కనకయ్య అందుకు ఒప్పుకున్నాడు.సీనయ్య చురుకైనవాడు కావడంతో తొందరగానే పట్నంలో నిలదొక్కుకున్నాడు. అందుకు కారణం కనకయ్యేనంటూ, కనకయ్యగురించి అందరికీ గొప్పగా చెప్పేవాడు సీనయ్య. సిరిసంపదలున్నా, అంతవరకూ కనకయ్యని అంతగా పట్టించుకున్నవారు లేరు. సీనయ్యరాకతో కనకయ్యకు పట్నంలో అన్నాళ్లూ ఎరుగని పేరుప్రతిష్ఠలు వచ్చాయి. అందుకాయన ఎంతో సంతోషించి, ‘‘నువ్వెలాంటివాడివో తెలియక మొదట్లో నిన్ను దగ్గరకు రానివ్వలేదు. కావాలంటే నువ్విప్పుడు నా ఇంట్లోనే ఉండొచ్చు’’ అన్నాడు సీనయ్యతో.