మహారాజు కొడుకు మహారాజే అవుతాడు. కానీ ఒక సామాన్యుడు రాజ్యపాలన చేపట్టాలంటే అర్హతలు సంపాదించుకోవాలేమోగానీ, ఒక రాజకుమారుడికి ఎలాంటి అర్హతలూ అవసరంలేదు! అంతఃపురంలో రాణికి మహారాజుకి రక్తంపంచుకుపుట్టినవాడైతే చాలు. కానీ ఈ కథలో మహారాజు తన కొడుకుగురించి అలా ఆలోచించలేదు. తన కొడుకు అర్హతలేమిటో తెలుసుకోడానికి ఎన్నోవిధాలుగా అతణ్ణి పరీక్షించాడు. పరీక్షల్లో ఆ కొడుకు గెలిచాడా? పాలనకు అతడు అర్హుడని రాజు ఎలా తెలుసుకోగలిగాడు?

************************

పట్టువదలని విక్రమార్కుడు చెట్టువద్దకు తిరిగివెళ్లి, చెట్టుపైనుంచి శవాన్నిదించి భుజానవేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, ‘‘రాజా, అవసరమైన అర్హతలన్నీ సాధించి రాజపదవిని పొందినవాడివి నీవు. నీవు ఏంచేసినా ప్రజల మేలుకోసమే. అందుకే, ఒక సిద్ధుడికి ఇచ్చిన మాటకోసం ఈ అపరాత్రివేళ ఇక్కడికి వచ్చి శ్రమపడుతున్నావంటే, ఇందులో నీ స్వార్థం ఉన్నదని అనుకోలేకపోతున్నాను. కానీ పురాణకాలంనాటి ధృతరాష్ట్రుడినుంచీ రాజులైనవారు స్వతహాగా మంచివారైనా పుత్రవ్యామోహం విడనాడక ప్రజలకు అన్యాయం చేశారు. నీవు కూడా అలాగే, ‘పుత్రవ్యామోహంతోగాని ఇక్కడకు రాలేదుకదా!’ అనే అనుమానం నాలో కలుగుతోంది. వెనుకటికి కుమారవర్మ అనే మహారాజు స్వతహాగా మంచివాడైనా, చివరికి అసమర్థుడైన కొడుకుకోసం తన రాజ్యాన్ని రెండు ముక్కలు చెయ్యడానికి కూడా వెనుకాడలేదు. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

చంచలదేశాన్ని ఏలే కుమారవర్మ ప్రజల్ని కన్నబిడ్డల్లా చూసుకుంటూ ఎంతో చక్కగా పాలించేవాడు. ఆయనకు లేక లేక పుట్టిన కవలలు జయవర్మ, రవివర్మ. అల్లారుముద్దుగా పెరిగిన ఆ బిడ్డలు ఇద్దరిలోనూ పెద్దవాడైన రవివర్మ చిన్నతనంనుంచీ అన్నివిద్యల్లోనూ తనకు తానే సాటి అనిపించుకుంటూ వచ్చాడు. జయవర్మ మాత్రం చదువు విషయంలో మందకొడిగా ఉంటూ అన్నకు తీసికట్టుగా ఉంటూ వచ్చాడు.ఇది రాజు వ్యథకి కారణమైంది. కొడుకులిద్దరూ సమంగా ఉండాలని ఆయన కోరిక. వాళ్లు పెద్దవాళ్లయ్యాక రాజ్యాన్ని రెండు సమభాగాలుచేసి ఇద్దరికీ ఇవ్వాలని అయనకు ఉండేది. ఐతే రాజు కావడానికి కనీస అర్హతలు ఉండాలి. పెద్దకొడుకు రవివర్మ అన్నివిధాలా రాజుకావడానికి అర్హుడు. చిన్నవాడు జయవర్మకు రాజయ్యే అర్హతలు లేవని ఆయన అనుమానం. అలాంటివాడికోసం చంచలదేశాన్ని రెండు ముక్కలు చెయ్యడం సబబు కాదనిపిస్తోంది. అందుకని ఆయన ఈ విషయంలో పిల్లల్నే సంప్రదించాలనుకున్నాడు.