విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. చెట్టువద్దకు తిరిగి చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, ఏ మూఢనమ్మకంతో ఏమి ఆశించి ఈ అపరాత్రివేళ నువ్విక్కడకు చేరుకున్నావో నాకు తెలియదు. కానీ మూఢనమ్మకాలు- ఇతరుల్లో మూర్ఖత్వాన్ని పెంచగలవే తప్ప, మన ఆశలు తీర్చలేవని కాస్త ఆలస్యంగా గ్రహించిన అలోకుడి కథ తెలుసుకోవడం ఉపయుక్తంగా ఉంటుంది. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

అలోకుడు వ్యాపారస్థుడు. బాగా చదువుకున్నాడు. కానీ, మూఢనమ్మకాలు ఎక్కువ. వీథిలోకెళ్లడానికి మంచిశకునం రావాలంటాడు. ప్రయాణానికి సుముహూర్తం కావాలంటాడు. సత్కార్యానికి జాతకం చూడాలంటాడు. అలాంటి వాటికోసం ఆగడంవల్ల అతడికి చాలాసార్లు వ్యాపారంలో నష్టాలు వచ్చాయి. అయినా అతడు పట్టించుకోలేదు.వివేకి అందమైన పిల్ల. తన ఈడు వారందరిలో తెలివైందని పేరు తెచ్చుకుంది. తల్లిదండ్రులు ఆమెకు అలోకుడితో పెళ్ళి చేస్తామంటే చూడ్డానికి బాగున్నాడుకదా అని సరేనంది. పెళ్ళయ్యాకనే భర్త మూఢనమ్మకాల గురించి ఆమెకు తెలిసింది.

వివేకి శివభక్తురాలు. అలోకుడు విష్ణుభక్తుడు. దేవుడు ఒక్కడే, ఏ పేరుతో పిలిచినా ఒకటే అని భార్య అంటే అలోకుడు ఒప్పుకోలేదు. ‘‘నాకు దేవుళ్లిద్దరు. శివుణ్లి పూజిస్తే మిగిలేవి బూడిద, శ్మశానం. విష్ణువుని పూజిస్తేనే సుఖవైభోగాలుంటాయి. నీకు శివకేశవులిద్దరూ ఒకటే కదా, ఇకమీదట శివపూజలు మాని విష్ణువునే పూజించు’’ అని భార్యని శాసించాడు. ఆ మాత్రానికి గొడవెందుకులే అని వివేకి అప్పటినుంచీ విష్ణువుని మాత్రమే పూజించసాగింది.