అతడోగొప్ప దానశీలి. కానీ తనపై వస్తున్న దుష్ర్పచారాన్ని తట్టుకోలేకపోయాడు. కుటుంబాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఒక అర్థరాత్రి ఇంటినుంచి బయటకు వచ్చేశాడు. కానీ ఊరు చివర ఊదలమ్మ దేవత అతడిని పొలిమేర దాటనివ్వలేదు. ఆ దేవతనే మొక్కుకుంటూ అక్కడే ఉండిపోయాడు. నిద్రలోకి జారుకున్నాడు. ఆ నిద్రలో అతడికి ఊదలమ్మ ప్రత్యక్షమైంది. అతడికి కర్తవ్యం బోధించింది. ఇక అప్పటినుంచీ అతడి దశ తిరిగింది. కానీ......

****************************

విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. చెట్టువద్దకు తిరిగి చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, ఇప్పటికే నీవు చాలా గొప్పవాడివి. ఐనా మరింత గొప్పవాడిని కావాలన్న ఆశ లేకపోతే ఈ సమయంలో ఇక్కడికొచ్చి ఉంటావనుకోను. ఎందుకంటే, ఏమాత్రమూ స్వార్థంలేకుండా, పరోపకారమే ధ్యేయంగా పెట్టుకుని ఎన్నో గొప్పపనులు చేసిన మకరందుడు లాంటివారు అరుదుగా ఉంటారు. పైగా ఒకరాజు అలాంటి మకరందుణ్ణి కాదని, ఉత్తపుణ్యాన అతణ్ణి తూలనాడే వికర్ణుడనేవాణ్ణే గొప్పవాడుగా భావించి సన్మానంకూడా చేస్తానన్నాడు. నీ విషయంలోనూ అలా జరిగే అవకాశం లేకపోలేదు. శ్రమ తెలియకుండా నీకు ఆ కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.

****************** 

 

గోదావరీ తీరంలో ఉన్న వెలిచేరు గ్రామంలో మకరందుడనే భూస్వామి ఉండేవాడు. ఆయనది జాలిగుండె. కష్టాల్లో ఉన్నవారు ఎవరు వచ్చి అడిగినా లేదనకుండా సాయం చేసేవాడు. ఆయన చేతులమీదుగా ఎందరో పేదవాళ్ల అప్పులు తీరాయి. పేదపిల్లలకు పెళ్ళిళ్ళు జరిగాయి. గ్రామస్థులందరూ ఆయన్ని అపర దానకర్ణుడని పొగిడేవారు -ఒక్క వికర్ణుడుతప్ప!ఆ ఊళ్లో వడ్డీ వ్యాపారం చేస్తూ పరమ కర్కోటకుడని పేరు తెచ్చుకున్న వికర్ణుడు మకరందుడికి దూరపుచుట్టం. తను స్వార్థపరుడే కాదు, ఈ ప్రపంచంలో ప్రతిఒక్కరూ స్వార్థపరులేనని నమ్ముతాడు. మకరందుడికి కీర్తికాంక్ష ఎక్కువనీ, దానకర్ణుడు అనిపించుకోవాలనే కోరికతోనే ఉన్న ఆస్తిని నాశనంచేసి భార్యాబిడ్దలకి తీరని అన్యాయం చేస్తున్నాడనీ ఊళ్లో ప్రచారం చేసేవాడతడు. ఈ ప్రచారానికి నొచ్చుకున్న మకరందుడు ఒకరోజు భార్య మధుమతినీ, కొడుకు వినయుణ్ణీ, కుమార్తె సుశీలనీ పిలిచి వికర్ణుడి ఆరోపణచెప్పి, ‘‘ఈ ఆస్తి నా పిత్రార్జితం. దీనిపై నాకెంత హక్కున్నదో నా వారసులైన మీకూ అంతే హక్కున్నది. నా దానగుణంవల్ల అన్యాయం జరుగుతున్నదనిపిస్తే, ఈ క్షణమే ఈ ఆస్తిని మీకు అప్పగిస్తాను. దానగుణం మానలేను కాబట్టి ఈ ఆస్తిని మీకప్పగించిన మరుక్షణం నేనీ ఊరు విడిచి తపోవనానికి వెళ్లిపోతాను’’ అన్నాడు.