విక్రమార్కుడు తన పట్టుదల వదలలేదు. చెట్టువద్దకు తిరిగి చేరుకున్నాడు. చెట్టెక్కి బేతాళుడు ఆవహించిన శవాన్ని దించి భుజాన వేసుకున్నాడు. ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు. అప్పుడు శవాన్ని ఆవహించిన బేతాళుడు, ‘‘రాజా, నీ దేశపౌరుల యోగక్షేమమే ముఖ్యమనుకునే మంచి పాలకుడివి. నువ్విక్కడికి రావడంలో దేశపౌరులకు జరిగే మేలేమిటో నాకు తెలియడం లేదు. నిన్ను చూస్తుంటే నాకు చతురుడు, దమనుడు అనేవాళ్లు గుర్తుకొస్తున్నారు. వాళ్లు తమ తమ దేశాలు వదిలి వేరే దేశం వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ స్థిరపడ్డ శత్రుదేశాలవాళ్లను ద్వేషిస్తూ అదే స్వదేశంపట్ల కర్తవ్యం అనుకున్నారు. అందువల్ల వారి వారి దేశాలకు జరిగే మేలేమిటో నువ్వు చెప్పగలవేమో అనిపిస్తోంది. శ్రమ తెలియకుండా నీకా కథ చెబుతాను విను’’ అంటూ ఇలా చెప్పసాగాడు.
ప్రచండ, ప్రమోదదేశాలు పక్కపక్కనే ఉన్నాయి. రెండు దేశాల రాజులూ అవినీతిపరులు. అందువల్ల రాజులకూ, వారి అనుచరులకూ సుఖాలు, వైభవాలూ పెరుగుతున్నాయి కానీ ఆ దేశాల్లో అభివృద్ధి లేదు. ఎక్కువమంది ప్రజలు పేదరికంలో మగ్గిపోతున్నారు.ఏ రోజుకైనా ప్రజలు తమపై తిరగబడతారని రాజుల భయం. అందుకని ఇద్దరు రాజులూ కూడా అన్ని సమస్యలకూ మూలకారణం పొరుగు దేశమేనన్న భావాన్ని తమ ప్రజలలో నాటుకుపోయేలా చేశారు. ఇంకా ప్రజల్లో తిరుగుబాటు ధోరణి ఉందన్న అనుమానం వచ్చినపుడు పొరుగుదేశంతో యుద్ధం ప్రకటించేవారు.
ఆ యుద్ధంలో ఎందరో సామాన్యులు చచ్చిపోయేవారు. బోలెడు డబ్బు ఖర్చయ్యేది. పేదప్రజలు మరింత పేదవారయ్యేవారు. కొన్నాళ్ల యుద్ధం తరువాత రెండు దేశాలూ తాత్కాలికంగా సంధి ఒప్పందం చేసుకునేవి. యుద్ధంవల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునేందుకు సామాన్యులు మరింత కష్టపడవలసి వచ్చేది. ఆ నష్టం అంతోఇంతో పూడుకుంటోందనగా మళ్లీ యుద్ధం వచ్చేది.