నూరుకట్ల కథలు–30భగవద్దర్శనంరచనః వసుంధరఒకానొక గ్రామంలో వివసుడనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు. కూతుళ్లకి పన్నెండేళ్లు రాగానే పెళ్లిళ్లుచేసి అత్తవారింటికి పంపించేశాడు. అందుకు ఆయనకు రెండువేల వరహాలు అప్పు అయింది. వివసుడికి పౌరోహిత్యమే జీవనాధారం. గొప్ప వేద పండితుడు కావడం వలన ఎవరినీ నోరు విడిచి దేహీ అని యాచించలేకపోయేవాడాయన. అందువల్ల సంపాదన అంతంత మాత్రంగానే ఉండేది.వివసుడి పెద్దకొడుకు సుగుణుడు, రెండోవాడు రజనుడు. కొడుకులిద్దరూ తనలాగా పౌరోహిత్యం చేయకుండా, గొప్ప పండితులై రాజాస్థానానికి వెళ్లి బాగా డబ్బు సంపాదించాలని వివసుడి కోరిక. అందుకని ఆయన వాళ్లిద్దరికీ చిన్నతనం నుంచీ వేదోపనిషత్తుల సారం, సంస్కృత కావ్యాల భావవిశేషం నూరి పోసేవాడు. సుగుణుడికి చదువెక్కేది కాదు. తండ్రి బలవంతం మీద కొన్నాళ్లు చదువుకున్నా, చివరికి ఒక రోజున తండ్రితో, 'ఈ చదువు నావల్ల కాదు. నేను మేనమామల ఇంటికి వెళ్లి, జీవితానికి పనికి వచ్చే చదువులు నేర్చుకుని బాగా డబ్బు సంపాదించి వచ్చి, మీకు సాయపడతాను' అన్నాడు.సుగుణుడి మేనమామలు వ్యాపారం చేసి అందులో రాణించి బాగా డబ్బు గడించారు. సుగుణుడిని తమవద్దకు పంపమని చాల కాలంగా వాళ్లు అడుగుతున్నారు. వారి ఇంట సుగుణుడికి ఈడైన అమ్మాయి ఉన్నది. ఆమెనిచ్చి పెళ్లి చేసి, వాళ్లు సుగుణుణ్ణి తమవద్దనే ఉంచుకోవాలని అనుకుంటున్నట్లు వివసుడికి తెలిసింది. కానీ సుగుణుణ్ణి వాళ్లవద్దకు పంపడం ఆయనకిష్టం లేదు. ఎందుకంటే వాళ్లు స్వార్ధపరులు. సుగుణుడు ఓ సారి వాళ్లింటికి వెడితే, అతడు కన్నవారిని కూడా మర్చిపోయే టంత స్వార్థపరుడయిపోతాడని ఆయన భయం. 'నాకైతే నువ్వు వాళ్ల్లవద్దకు వెళ్లడం ఇష్టం లేదు. అలాగని నీకిష్టమైతే వెళ్లొద్దనీ అనలేను' అని పరోక్షంగా చెప్పాడు వివసుడు.తండ్రి ఉద్దేశ్యం సుగుణుడికి అర్థమైంది. అయినా, 'నాకిష్టమే' అని చెప్పి మేనమామల ఇంటికి వెళ్లిపోయాడు.  నిరుత్సాహపడ్డ వివసుడు ఇక అన్ని ఆశలూ చిన్న కొడుకు రజనుడిమీదే పెట్టుకున్నాడు. ఆపైన రజనుడు కూడా చదువంటే ఎంతో ఆసక్తి చూపడం ఆయనకు సంతోషం కలిగించింది. కానీ, ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు.