భయాన్ని జయించినప్పుడే మన అసలైన జీవితం ఆరంభమవుతుంది. కానీ ఇప్పటికీ ఆ భయాన్ని జయించలేకపోతున్నారు చాలామంది స్ర్తీలు. బల్లిని చూస్తే భయం! బొద్దింకను చూస్తే భయం! అందుకేనేమో జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు కూడా ఓర్పు, సహనంతో ఆధిక్యతకులొంగి బేలగా మిగిలిపోతున్నారు. ఈ కథలో ఒక ఇల్లాలు పరిస్థితీ అదే ప్రతిదానికీ తెగభయపడిపోతుంది. ఇలాగే ఒకసారి ఏమైందంటే...

*****************

ఉదయం తొమ్మిది గంటలు!బెడ్‌రూమ్‌లో ముఖానికి గబగబా పౌడరు అద్దుకుంటూ, ‘‘ఏమోయ్‌! వంట అయిందా? నా క్యారేజీ సర్దేశావా?’’ కేకపెట్టాడు మాధవ.‘‘ఐపోయిందండీ! క్యారేజీ రెడీ! మీరొక్కసారి వంట గదిలోకి రండి’’మహాలక్ష్మి వంటగదిలోంచే జవాబిచ్చింది.‘‘వంట గదిలోకా? ఎందుకు? తొమ్మిదిన్నరకల్లా ఆఫీసుకు ఠంచనుగా వెళ్ళిపోవాలి. ఐదునిముషాలు లేటైనా, నా ఆలస్యం పంచింగ్‌ మిషన్‌లో పబ్లిగ్గా రికార్డైపోతుంది’’ హడావుడిపడుతూ వంటగదిలోకి వచ్చాడు మాధవ.వంటగదిలో మహలక్ష్మి అష్టావధానం చేస్తూ స్వేదముత్యాలతో తడిసిపోయింది.‘‘ఏవిటోయ్‌? ఎందుకు పిలిచావ్‌.? నాకు అవతల టైమైపోయింది!’’ మాధవ తొందరపడ్డాడు.‘‘ఏం లేదండీ! మీ క్యారేజీ ఇదిగో. సిద్ధంగా ఉంది. ఆ మూల తగిలించిన సంచి ఇలా అందుకోండి’’‘‘అదేవిటే, ఆ క్యారేజీ బ్యాగు నీకు అందుబాటులోనే ఉంది కదా! నువ్వే తీసుకోవచ్చుకదా!’’ మాధవ ఆశ్చర్యంగా అన్నాడు.‘‘అదీ... అదీ’’ మహలక్ష్మి అటూ ఇటూ బిత్తరచూపులు చూస్తోంది.

‘‘ఏవిటదీ? ఎందుకలా గుడ్లప్పగించి చూస్తున్నావ్‌?’’ మాధవ ఆ మూలనున్న మేకును తప్పించి సంచీనీ క్రిందకులాగాడు. లాగిన సంచీ వెనుకనుంచీ పెద్దబల్లి ఒకటి గోడమీద జరజరా పాకుతూ పైకివెళ్ళిపోయింది. మహలక్ష్మి జడుసుకున్నట్టుగా ఒక అడుగు వెనక్కి వేసింది.‘‘ఓసి నీ భయం పాడుగానూ! బల్లులకీ, బొద్దింకలకీకూడా భయపడిపోతుంటావా? నువ్వికమారవా? బహుశా మీ అమ్మగారికి భయం ముందుపుట్టి దాంతోబాటే నువ్వూ పుట్టి ఉంటావ్‌, ఏవంటావ్‌?’’ ఎగతాళిగా నవ్వేశాడు మాధవ.‘‘చాల్లెండి! నవ్వింది చాలుగానీ, మీకు టైమైంది నడవండి!’’ సంచిలో క్యారేజీ సర్ది భర్త చేతికిచ్చింది మహలక్ష్మి.‘‘సరే... బై! ఈ రోజు స్కూలుకి కవిత ఒక్కతేగా వెళ్ళింది. వంశీ ఏంచేస్తున్నాడు?’’ వరండా ముందు నిలబెట్టిన మోటారు సైకిలు వెనుక, క్యారేజీ తగిలించి బండి బయటకుతీశాడు మాధవ.