‘‘హైదరాబాద్‌లో పన్నెండోతేదీ రాత్రే పెళ్ళి.మధ్యాహ్నం భోజనాలు.ఆ పొద్దుటనించీ పెళ్ళితంతు జరుగుతూనే ఉంటుంది. అదే....తోటలో దిగడం కార్యక్రమాలూ అవీ. ఒక్కడే కొడుకు. అందుకే అన్నీ శాస్త్రోక్తంగా జరిపిస్తున్నాం. సరదా, సందడి చేయడానికి మా వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు.
ఇక్కడ బంధువులూ, స్నేహితులూ తెలిసిన వాళ్ళందర్నీ పిలుస్తున్నాం. మీ అబ్బాయితో మా వాడికి చాలా స్నేహం కదా. మీరిద్దరూ కూడా తప్పకరావాలి. ఆ రోజు పొద్దున్న పదిగంటలకే రండి. టిఫిన్లూ, భోజనాలూ అన్నీ అక్కడే చేద్దురుగాని’’ గుక్కతిప్పుకోకుండా మాట్లాడుతూనే రుమాలులో పట్టుకున్న కుంకుమ భరిణ తీసి రాజేశ్వరికి బొట్టుపెట్టింది విశాలాక్షి.ఏదో అప్పుడప్పుడు ఏ గుడిలోనో చూసినప్పుడు చిరునవ్వుల పలకరింపులు తప్ప అంతకెక్కువ పరిచయంలేదు ఆవిడతో. రాజేశ్వరికి కూడా ఒక్కడే కొడుకు. ఇద్దరి పిల్లలూ చిన్నప్పట్నుంచీ క్లాస్‌మేట్స్, స్నేహితులు కూడా. ఎప్పుడూ కలిసిమెలిసి తిరుగుతారు. పెద్దయ్యాక కూడా చదువులో బాగా రాణించారు. ఇద్దరూ సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌గా స్థిరపడ్డారు. మాట్లాడితే అమెరికా వెళ్ళి వస్తుంటారు.
విశాలాక్షి కొడుకు శ్రీకాంత్‌కి చిన్నప్పటినుంచీ అనుకున్న మేనరికమే. అమ్మాయి కూడా ఎం.టెక్ పాసైంది. ఇక జాబ్ చూసుకోవాలి. ఇద్దరూ కలిసి అమెరికాలో ఉండాలని ప్లాన్. ముందే ముచ్చటగా వాళ్ళిద్దరికీ పెళ్ళి చేస్తున్నారు.విశాలాక్షి సంబరానికి అంతులేదు. పెళ్ళి పిలుపులకి చెల్లెలూ, ఆడబడుచు, భర్తా అంతా కలిసి వచ్చారు.వాళ్ళ సరదా, ఆర్భాటం చూసి రాజేశ్వరికి చాలా ముచ్చటేసింది. తన కొడుకు కూడా ఇప్పుడే పెళ్ళిచేసుకుంటే బాగుండుననుకుంటోంది. తన కొడుకు రాజేష్‌కి పెళ్ళిమీద దృష్టిలేదు. ‘‘ఇప్పటి నుంచీ ఎందుకమ్మా, ఇంకా మూడు నాలుగేళ్ళు పోనీ’’ అంటున్నాడు.