ఇన్‌కమ్‌టాక్స్ ఆఫీసర్ వడ్డీ కాసులుగారి ఇల్లు ఎక్కడంటే, ఆ ఏరియాలో ఎవరిని అడిగినా చెబుతారు. ఆయనకున్న పలుకుబడి ఇంతా అంతా కాదు. ఇసుకనుంచి తైలాన్ని పిండగల ప్రతిభ ఆయన సొంతం. నల్లధనాన్ని ఎంత సమర్థంగా దాచిపెట్టి, దొంగలెక్కలు చూపించినా, కాసులుగారు రకరకాల ప్రశ్నలువేసి అవతలివాణ్ణి బోల్తాకొట్టించి,వాళ్లనోటివెంటే అసలు రహస్యాలు చెప్పించగల శక్తియుక్తులు ఆయనవద్ద ఉన్నాయని అందరూ అనుకుంటూ ఉంటారు. ఆ మధ్య ఓ బిచ్చగాడు మేడ కట్టిస్తే, అది పసిగట్టి, వాడి లెక్కలన్నీ ఆరా తీసి వాడిచేత కూడా ఇన్‌కమ్‌టాక్స్ కట్టించడాన్ని అందరూ గొప్పగా చెప్పుకున్నారు.
అలాంటి కాసులుగారికి జీవితంలో ఒకటే లక్ష్యం. తన సత్తా చూపిస్తూ, అంచెలంచెలుగా పైకెదిగి ఎప్పటికైనా ఇన్‌కమ్‌టాక్స్ కమీషనర్‌గా తనపేరును చూసుకోవాలని!ఆ రోజు రాత్రి....కాసులుగారు నిద్రపట్టక, మంచంమీద అటూ ఇటూ దొర్లసాగారు. ఆ రోజు ఆఫీసులో జరిగిన మీటింగ్‌లో పై అధికారిచెప్పిన మాటలు పదేపదే గుర్తుకు రాసాగాయి.‘‘మనకు దేశం ఏమిచ్చిందన్నది ముఖ్యం కాదు, మనం దేశానికి ఏమిచ్చాం.. అన్నదే ప్రధానం. దేశం ఇప్పుడు క్లిష్టపరిస్థితుల్లో ఉంది. అందువల్ల మనం మునుపటికంటే మరింత ఎక్కువగా కష్టపడాలి. బ్లాక్‌మనీ దాచినవాడు ఏ రేంజ్ మనిషైనాసరే, మనం రెయిడ్ చేయడానికి వెనకాడాల్సిన పనిలేదు. మనకిప్పుడు పుల్‌పవర్స్ ఉన్నాయి.
అందువల్ల వాడు, వాడి బంధువులతో వాడికున్న లావాదేవీలు...అన్నీ బైటికి లాగండి, ఈ రెయిడ్స్‌లో ఎవరెంత ఎక్కువ బ్లాక్‌మనీని బైటికితీస్తే వాళ్లకు స్పెషల్ ప్రమోషన్‌లు ఉంటాయి. అంతేకాదు... క్యాష్‌రివార్డ్స్ కూడా ఉంటాయి. కమాన్...ఇక మీ సత్తా చూపించండి. మన డిపార్ట్‌మెంట్ ఘనత ఏమిటో నిరూపించండి. ఇవాళ దేశమంతా మనవైపే చూస్తోంది’’.కాసులుగారికి ఆ మీటింగ్‌లో చెప్పిన స్పెషల్ ప్రమోషన్‌లు, క్యాష్ అవార్డులు అన్నమాటలు బాగా నచ్చాయి. అందరికంటే పెద్ద టార్గెట్ కొట్టాలంటే, సాధారణమైన వ్యాపారస్థులవల్ల ప్రయోజనం లేదు. అసాధారణమైన వాణ్ణి పట్టుకోవాలి.. ఎలా...ఎలా..?