పూటకోవేషం.. పొట్టకూటి వినోదం. డొక్క లోపలికి పోయినా డీలా పడేవాడు కాదు. నలుగుర్నీ పలకరిస్తూ, నవ్వుల నదిలా ప్రవహించేవాడు. అరచేతిలో కాణీ పడినా చాలు- ‘బోణీ’ అని కళ్ళకద్దుకునేవాడు. ఎప్పుడొస్తాడా? అని అతడికోసం ఎదురుచూసేవాళ్ళు కొందరైతే, ఎప్పుడొదుల్తాడా? అని విసుక్కునేవాళ్ళు ఇంకొందరు. ‘బొబ్బిలి బూచాడు’ వచ్చాడంటే బెలగాం సెంటర్లో సందడే సందడి.
‘‘గౌరమ్మ రాకను -గంగమ్మ చూసిఎండు చేపలు తెచ్చి- వాకిళ్ళ పరచెపచ్చి చేపలు తెచ్చి -పందిళ్ళ పరచెకప్పకడిగిన నీళ్ళు-కళ్ళాపు జల్లె..’’పేద్ద గొంతుక పెట్టుకుని దీర్ఘాలు తీస్తూ బెలగాం సెంటర్ లో ‘గంగా-గౌరీ సంవాదం’ వినిపించిందంటే బొబ్బిలి బూచాడు వచ్చాడనే! ఆ సంగతి అన్ని వీథులకీ పాకి పోయేది. అగ్రహారం వీథి మొదలుకుని దాసరి వీధి వరకు ఏడేడు వీధుల కుర్రసజ్జు వాడి కోసం ఎగబడేది. నిక్కర్లు ఎగలాక్కుంటూ రోడ్డు మీదికొచ్చిన సత్రకాయల్ని బొబ్బిలి బూచాడు వెంటబెట్టుకునే వాడు. ప్రతీ గడపా ఎక్కిదిగుతూ ‘బాబ్బాబ్బాబు..నాయిన్నాయిన్నాయి...’ అంటూ అడుక్కునేవాడు.
నడక నేర్చిన నల్లచింతపండులా ఉండేవాడు బొబ్బిలి బూచాడు. గోళీకాయల ఆట కోసం తవ్విన గుంటల్లా ఉండేవి వాడి కళ్ళు. చేతికి నూనె రాసుకుని దబ్బనంతో ఒలిచిన చింతపిక్కల్లా తడి తడిగా మెరిసేవి వాడి కనుపాపలు. బొబ్బిలి బూచాణ్ని అలా చూసిన వాళ్ళు తక్కువమందేనని చెప్పాలి. ఎందుకంటే వాడు ఎప్పుడూ ఏదో ఒక వేషంలో వచ్చేవాడు. ఒంటికి రంగులు పూసుకుని, కంటికి నల్లద్దాలూ పెట్టుకునేవాడు.వాడి స్వస్థలం బొబ్బిలి రైల్వేస్టేషన్‌కి కూతవేటు దూరంలోని మల్లంపేట. పేట చివార్న చిల్లుల గుడిసెలో బొబ్బిలి బూచాడు ఉండేవాడు. బూచాడిభార్య రోజూ దగ్గరలోని సూదికొండకు వెళ్లి కర్రా, కంపా మోసుకొచ్చేది. మూడూళ్ళు తిరిగి మొగుడు అడుక్కుని తెచ్చిన దాంతో ఇల్లు నెట్టుకొచ్చేది.
వాళ్లకి చాలా కాలం తర్వాత లేక లేక ఓ కొడుకు పుట్టాడు.బొబ్బిలి చిన్నసైజు రైల్వే జంక్షను. ఉత్తర దిక్కున పార్వతీపురం, దక్షిణం వైపు విజయనగరం, మరో వైపు సాలూరు బ్రాంచ్ లైను ఉన్నాయి. ఉదయాన్నే బూచాడు ఇంట్లో రంగు పూసుకుని బొబ్బిలి స్టేషన్ కి చేరుకునేవాడు. విశాఖపట్నం-–రాయ్‌పూర్ మధ్య నడిచే ప్యాసింజర్ బళ్ళలో రోజుకో దిక్కు వెళ్ళేవాడు, మధ్యలో బ్రాంచ్ లైన్ బండిలో సాలూరు వెళ్ళేవాడు. ఏ బండిలోనూ వెళ్ళని రోజున బొబ్బిలి ఊళ్ళో వేణుగోపాలస్వామి కోవెల దగ్గరో, తాండ్ర పాపారాయుడి చావిడి దగ్గరో, కోట గుమ్మం దగ్గరో వేషాలు వేస్తూ అడుక్కునేవాడు.